– పోరు కొనసాగిస్తాం
– సోనియా, రాహుల్
– తల్లి, కొడుకులకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ,డిసెంబర్ 19(జనంసాక్షి): రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో తాము ఒత్తిళ్లకు తలొగ్గేదేలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు స్పష్టం చేశారు. శనివారం వీరివురు నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా హౌజ్‌కోర్టు హాజరయ్యారు.పాటియాలా హౌజ్‌కోర్టు సోనియా, రాహుల్‌లకు బెెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా శనివారం వారు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. సోనియా, రాహుల్ తరపున కపిల్ సిబల్ కేసును వాదించారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయమూర్తిని కోరగా, చెరో రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురికి బెయిల్ మంజూరు చేశారు. అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉన్న శ్యామ్ పిట్రోడాకు హాజరునుంచి మినహాయింపు ఇచ్చారు. మరోపక్క సోనియా, రాహుల్‌గాంధీలకు బెయిల్ ఇవ్వడాన్ని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించారు. రాహుల్‌కు ప్రియాంక గాంధీ, సోనియాగాంధీకి ఏకే ఆంటోనీలు పూచీకత్తు ఇచ్చారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది. అనంతరం కోర్టు నుంచి సోనియా, రాహుల్‌లు వెనుదిరిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మొత్తం ఏడుగురికి పటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మూడు నిముషాల్లో ముగిసిన విచారణ
నేషనల్ హెరాల్డ్ పత్రిక హక్కులు అక్రమంగా పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పాటియాలా కోర్టులో హాజరయ్యారు. 3.03 నిమిషాలకే మళ్లీ వారు కోర్టు బయటకు వచ్చారు. వారు కోర్టులో ఉన్నది కేవలం 3 నిమిషాలు మాత్రమే కావడం విశేషం. ఈ మూడు నిమిషాలల్లోపే వాదనలు జరగడం, బెయిల్ మంజూరు అవడం చకచకా జరిగిపోయాయి. సోనియా, రాహుల్ తరపున కపిల్ సిబల్ వాదించారు. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి. అయితే సోనియా, రాహుల్‌కు బెయిల్ విషయంలో షరతులు విధించాలని కోర్టును స్వామి అభ్యర్థించారు. స్వామి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సోనియా, రాహుల్ ప్రజాదరణ కలిగిన వ్యక్తులు. వారికి షరతులు అవసరం లేదు. వారు పారిపోతారనే ఆందోళన కూడా అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఇక సోనియాకు ఏకే ఆంటోనీ, రాహుల్‌కు ప్రియాంక గాంధీ పూచీకత్తు ఇచ్చారు. సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు అవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా పడింది. కపిల్ సిబల్ విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టును ఎలాంటి మినహాయింపులు తాము కోరలేదని పేర్కొన్నారు. అనారోగ్య కారణాల రీత్యా శ్యాంపిట్రోడాకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కు న్యాయస్థానం వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఆ రోజు మళ్లీ సోనియా, రాహుల్‌గాంధీలు కోర్టుకు హాజరవుతారని తెలిపారు.
మద్దతుగా తరలివచ్చిన నేతలు
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్‌గాంధీలకు మద్దతుగా కాంగ్రెస్ నాయకగణం తరలివచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, సోనియా కుమార్తె ప్రియాంకగాంధీ సహా పలువురు కోర్టు కు వచ్చారు. భారీగా మోహరించిన భద్రతా దళాలు నివారం దిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు సవిూపంలోని పలు దుకాణాలు మూసివేశారు. కోర్టు ప్రాంగణంలో అదనంగా 16 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. పోలీసుల బలగాలతో పాటు, ప్రత్యేక భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు.
ఒత్తిళ్లకు లోంగేది లేదన్నే సోనియా
తాము ఎలాంటి ఒత్తిళ్లకు భయపడేది లేదని పేదలు, బీదసాదల కోసం తాము పనిచేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో సోనియా, రాహుల్‌గాంధీలకు పటియాల హౌజ్‌కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఏఐసీసీ కార్యాలయం చేరుకున్న వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. ఈ దేశంలో రాజ్యాంగం అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుందని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. తమ మార్గం నుంచి ఎవరూ తప్పించలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిజాలు బయటకు వస్తాయని అందులో ఎలాంటి సందేహం లేదని ఆమె పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఒత్తిడి చేస్తే ప్రతిపక్షం తలవంచుతుందని భావిస్తున్నారని అన్నారు. తాము ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తాము ఎన్నటికీ విడేదిలేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ ప్రజల పక్షం ఉంటుందని, ప్రజల పక్షమే కాంగ్రెస్ పక్షమని వ్యాఖ్యానించారు. ఒత్తిళ్ల ద్వారా ప్రతిపక్షాలను అణచివేయలేరని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై కక్షతోనే కేసులు: ఆజాద్
బీజేపీ ప్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీపై రాజకీయ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్షాలను టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికలకు మందు కాంగ్రెస్ రహిత భారత్ కోసం బీజేపీ ప్రయత్నించింది. విముక్త కాంగ్రెస్ అన్న నినాదం అందుకేనని అన్నారు. అధికారంలోకి వచ్చాక విపక్ష రహిత భారత్ కోసం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు. న్యాయపరంగానే నేషనల్ హెరాల్డ్ కేసును ఎదుర్కొంటామని అన్నారు. భారత న్యాయ వ్యవస్థపై కాంగ్రెస్‌కు పూర్తి నమ్మకం ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసును చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఈ కేసును రాజకీయం చేయదల్చుకోలేదని తెలిపారు. న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామని చెప్పారు. రాజకీయాలు కాంగ్రెస్ చేయట్లేదు.. బీజేపీనే చేస్తుందని మండిపడ్డారు. అసహనంపై పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వలేదు. సభలో అరుణాచల్‌ప్రదేశ్ విషయాన్ని లేవనెత్తినప్పుడు దాట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా సోనియాకు మద్దతుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్గాలు ఆందోళనలు చేపట్టాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాందీ, రాహుల్ గాంధీలకు మదద్తుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారికి సంఘీభావంగా ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి,మాజీ మంత్రి గీతారెడ్డి ,దానం నాగేందర్ తదితరులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.ఈ సందర్భంగా ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ విద్వేష కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలలో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. సుబ్రహ్మణ్య స్వామి కి పనీ పాటలేకుండా కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. వివిధ జిల్లాలలో కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు. గీతారెడ్డి మాట్లాడుతూ ఇడి ఈ కేసులో ఎలాంటి తప్పు జరగలేదని చెప్పిన తర్వాత కూడా సోనియాగాందీ, రాహుల్ లపై కేసు కొనసాగించడం శోచనీయమని అన్నారు. ఈ కేసును ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉందన్నారు. కాంగ్రెస్‌పై కక్షసాధింపు చర్యలను తిప్పికొడతామని అన్నారు.





