
కేంద్రాన్ని నిలదీసిన దిల్లీ హైకోర్టు
దిల్లీ, జనవరి 16, (జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంగా స్వల్ప వ్యవధిలోనే దేశరాజధానిలో సుమారు 15 వేల సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్న విషయమై దిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. ఇదే వేగాన్ని దేశంలోని పౌరుల భద్రత విషయంలో కనబర్చడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టింది. మన పౌరుల అవసరాలు తీరాలంటే ‘ఆకాశం నుంచి ఎవరో ఒక వ్యక్తిని తీసుకురావాల్సి ఉంటుంది” అని జస్టిస్ బాదర్ దుర్రేజ్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవలతో కూడిన ధర్మాసనం వ్యాఖానించింది. ‘నిర్భయ అత్యాచార ఘటన’ సహా పలు అత్యాచార సంఘటనలు చోటు చేసుకుంటున్నందున.. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను ఒబామా పర్యటన అనంతరం కూడా కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ”ఒక విదేశీ అధ్యక్షుడి పర్యటన పురస్కరించుకుని స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారతీయుల భద్రతకు సంబంధించి మేము ఆదేశిస్తే మాత్రం నెలలు, సంవత్సరాల పాటు సమయం తీసుకుంటారు” అని న్యాయస్థానం ఘాటుగా విమర్శించింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు, స్థానిక పోలీసులు తమ స్పందనను తెలియచేయాలంటూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.




