నగరం నుంచి ఇద్దరు, ఖమ్మం నుంచి ఒకరు
పార్టీ సంస్థాగత బలోపేతానికి సీఎం కేసీఆర్ దృష్టి
హైదరాబాద్, జనవరి 16, (జనంసాక్షి): తెరాసలో చేరేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు, ఖమ్మం నుంచి ఓ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , తెరాస అధినేత కేసీఆర్ చెప్పారు. వారితో పాటు హైదరాబాద్‌లోని 20 మంది కార్పోరేటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. కొత్తవాళ్ల చేరికతో పార్టీ నేతలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని అందరికీ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు, పాతవారితో కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలిసింది. కష్టపడేవారికి పదవులు ఇస్తామని కూడా చెప్పినట్టు సమాచారం. ఏప్రిల్ 25, 26 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ, 27న బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఏప్రిల్ 1లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలనుకుంటున్నట్టు భావిస్తున్నారు. కాగా, వచ్చే వారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించినట్టు తెలిసింది. కరెంట్ కష్టాలను త్వరలో అదిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక మరోవైపు ఆగస్టు నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు విద్యుత్ అందిస్తామని సీఎం ప్రకటించారు.




