ఓయూ ఉద్రిక్తత
రణరంగమైన ఓయూ
విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ముందుకు వెళ్లకుండా అడ్డగింత
బాష్పవాయు గోళాల ప్రయోగం
హైదరాబాద్, జూన్ 13 (జనంసాక్షి):ఉస్మానియా యూనివర్సిటీ రెండో రోజూ రణరంగమైంది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య భీకర ‘యుద్ధం’ జరిగింది. తెలంగాణ నినాదాలు, ఖాకీల తుపాకీల మోతలతో మార్మోగింది. రాళ్ల దాడులు, బాష్పవాయు గోళాలతో క్యాంపస్ ¬రెత్తింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్ జేఏసీ) ఆధ్వర్యంలో ఎనిమిది విద్యార్థి సంఘాలు గురువారం నిర్వహించ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ రణరంగాన్ని తలపించింది. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. వాగ్వాదం, తోపులాట, రాళ్ల వాన, టియర్‌గ్యాస్ ప్రయోగంతో ఉస్మానియా ఉద్రిక్తంగా మారింది.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీ-జేఏసీ శుక్రవారం తలపెట్టిన చలో అసెంబ్లీకి సన్నాహకంగా టీఎస్ జాక్ నేతృత్వంలో ఏఐఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ సహా ఎనిమిది విద్యార్థి సంఘాలు ‘చలో అసెంబ్లీ’ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరారు. కాగా, బుధవారం తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. ఓయూ చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఆర్‌ఏఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. టీఎస్ జాక్ విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో ఎన్‌సీసీ గేటు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు అడ్డం పెట్టారు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్దే నిలిపివేశారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, క్యాంపస్ దాటి వెళ్లేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నినాదాలతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ’, ‘పోలీసు గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఎంతకీ పోలీసులు ముందుకు వెళ్లనీయక పోవడంతో విద్యార్థులు ముళ్లకంచెను లాగిపడేశారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించేందుకు యత్నించారు. బారికేడ్లను తొలగించి క్యాంపస్‌లోకి లాక్కుపోయారు. ఎన్‌సీసీ గేటు దాటేందుకు యత్నిస్తుండగా.. పోలీసులు రెచ్చిపోయారు. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో విద్యార్థులు ఎదురుదాడికి దిగారు. ఖాకీలపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసుల దాడితో వెనక్కు వెళ్లిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత మళ్లీ ముందుకు వచ్చారు. మళ్లీ పోలీసులు అడ్డుకోవడం, విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించడం, భాష్పవాయు గోళాలు మార్మోగడం… దాదాపు మూడు గంటలకు పైగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులతో ఉస్మానియా వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ముళ్ల కంచెను తొలగించేందుకు యత్నించిన ముగ్గురు విద్యార్థుల చేతులకు గాయాలయ్యాయి. మరోవైపు, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా, ప్రత్యక్ష ప్రసారాలు చేయకుండా పోలీసులు ఎలక్టాన్రిక్ విూడియాకు చెందిన కొన్ని చానళ్ల వైర్లను కత్తిరించారు. దీనిపై జర్నలిస్టులు తీవ్రంగా మండిపడ్డారు.
ఖాకీమయమైన ఓయూ పరిసరాలు
టీ-జేఏసీ చలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసు అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన ఉస్మానియా యూనివర్సిటీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. విద్యార్థులు క్యాంపస్ దాటి బయటకు వస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని భావిస్తున్న పోలీసులు.. వారిని బయటకు రాకుండా నిలువరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఎన్‌సీసీ గేటు, తార్నాక మార్గాన్ని అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్ నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో ముళ్ల కంచెలు వేశారు. ఓయూ చుట్టూ సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ బలగాలను మోహరించారు. ఒక్క ఎన్‌సీసీ గేటు వద్దే సుమారు 30 కంపెనీల బలగాలను వినియోగిస్తున్నారు. అలాగే తార్నాకతో పాటు మాణికేశ్వర్‌నగర్ వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. క్యాంపస్ నుంచి రాకపోకలు నిలిపివేశారు.




