Tuesday, 3 November 2026

ఓరుగల్లుపై వరాల జల్లు

C

– ఏటా 300 కోట్ల విడుదల

– దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు

– ట్రైబల్‌ యూనివర్సీటీతోపాటు పలుప్రతిష్టాత్మక విద్యాసంస్థలు

వరంగల్‌,జనవరి 6(జనంసాక్షి): ఓరుగల్లుపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వరంగల్‌ సమగ్రాభివృద్దికి  ముఖ్యమంత్రి కార్యాచరణతో పాటు కార్యక్రమాలను కూడా ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కును జిల్లాలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అలాగే జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తామని అన్నారు. వరంగల్‌ జిల్లాలో పర్యటనలో ఉన్న ఆయన అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం  అధికారులతో చర్చించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సవిూక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సవిూక్ష వివరాలు వెల్లడించారు.తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వరంగల్‌ అభివృద్ధి కోసం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి  తెలిపారు. వరంగల్‌ అభివృద్ధి కోసం ప్రతి ఏటా బడ్జెట్‌ నుంచి నేరుగా రూ. 300 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. వరంగల్‌ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారని, జిల్లా మంత్రి నేతృత్వం వహిస్తారని చెప్పారు. జిల్లాలో 2-3వేల ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందన్నారు. కాటన్‌ టు గార్మెంట్‌ వరకు అన్ని రకాల వస్త్రాలను తయారయ్యేవిధంగా దేశంలోనే నెంబర్‌ వన్‌ టెక్స్‌టైల్‌ హబ్‌గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. రాబోయే మూడు నాలుగేళ్లలో అదనంగా మూడు, నాలుగు లక్షల జనాభా వరంగల్‌కు వచ్చి చేరే అవకాశముందని, ఆ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌ నుంచి బాజాప్తగా ఇస్తామని చెప్పారు. టెక్స్‌టైల్‌ పార్క్‌కు అవసరమైన భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఈ పథకం కింద వరంగల్‌ జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలకు గోదావరి నీరు అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే వరంగల్‌ను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. వరంగల్‌లో త్వరంలో సైనిక్‌ స్కూల్‌, దిల్లీ, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూళ్లు ఏర్పాటుకానున్నట్లు చెప్పారు. వచ్చే పర్యటనలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తానన్నారు. వచ్చే ఏడాదిలోగా పశువైద్య కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే  వరంగల్‌కు 30వేల రెండు పడక గదుల ఇళ్ల మంజూరు చేశారు.  వీటిలో 2శాతం ఇళ్లు మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించనున్నట్లు చెప్పారు.  వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కోసం 12 అంతస్తుల భవనం నిర్మాణం చేపడతామన్నారు.  250-300 ఎకరాల్లో థీమ్‌ పార్కు ఏర్పాటుకు కూడా సిఎం సుముఖత వ్యక్తం చేవారు.  కేఎంసీ పరిసరాల్లో ట్విన్‌ టవర్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, వరంగల్‌ సెంట్రల్‌ జైలును మామునూరుకు బదిలీ చేయడం తదితర నిర్ణయాలను ప్రకటించారు.  రాష్ట్రంలోని మాజీ సైనికుల ఆస్తులు భార్య పేరిట ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు.  వరంగల్‌లో అన్ని సదుపాయాలతో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేస్తామని హావిూఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై ఆయన స్పందించారు. కోరుకొండ స్థాయిలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేసి, వరంగల్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు కావాలని ఆకాంక్షించారు. వరంగల్‌లో వెటర్నరీ, అగ్రికల్చర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్‌లో ట్రైబర్‌యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్‌ను శాస్త్రీయ పద్దతిలో అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో హైజెనిక్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథపై సవిూక్ష చేసిన సందర్భంగా వివిధ అభివృద్ది పథకాలను సవిూక్షించారు.  వరంగల్‌ నగరంలో చెరువులు మురికి కూపాలుగా మారాయని, వాటన్నటిని ఈ ఏడాది ఈ చెరువులన్నీ మిషన్‌ కాకతీయ కింద క్లీన్‌ చేస్తామన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌భగీరథ పనుల్లో వేగం పెంచాలని యంత్రాంగాన్ని  ఆదేశించారు. నాలుగు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 30 నుంచి గోదావరి జలాలు అందిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి మిడ్‌ మానేరును గోదావరి నీటితో నింపుతామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని రామప్ప చెరువుకు అనుసంధానం చేయడంతో పాటు. రామప్ప చెరువు నుంచి లక్నవరం, ఘణపురంచెరువులకు నీరందిస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లోని రామప్ప, లక్నవరం, ఘనపురం చెరువులను మిషన్‌ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేస్తామని, అంతేకాకుండా ఈ చెరువుల అనుసంధానం చేపట్టి ఏడాది పొడుగుతా నీళ్లు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రామప్ప చెరువును పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. వచ్చే జూన్‌ లోగా ఈ చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక పట్టణమైన వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌ను తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే భూసేకరణకు రూ. 100 కోట్లు విడుదల  చేసినట్టు చెప్పారు.  జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సవిూక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్‌, జిల్లా పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌ అభివృద్ది అథారిటీ ఏర్పాటు

హైదరాబాద్‌ తరువాత రాష్ట్రంలో అతిపెద్ద నగరం వరంగల్‌. వరంగల్‌ అభివృద్ధి కోసం స్పెషల్‌ అథారిటీ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. వరంగల్‌కు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీపుల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కాటన్‌ నుంచి గార్మెంట్‌ దాకా టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో తయారయ్యే విధంగా ఏర్పాటు ఉంటుందన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో వరంగల్‌ నగరంలో 4.5 లక్షల జనాభా పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగూనంగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌ కలెక్టరేట్‌కు నూతనంగా మల్టీ స్టోరైడ్‌ భవనం నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 12 అంతస్తులతో నూతన పోలీస్‌ కమిషనరేట్‌ అదునాతన సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్‌లో 200-300 ఎకరాల్లో థీమ్‌ పార్క్‌ నిర్మిస్తామని వెల్లడించారు. సెంట్రల్‌ జైలును మామునూరు ప్రాంతానికి తరలిస్తాం. వరంగల్‌లో కొన్ని వందల కొత్త ప్రభుత్వ భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నగరంలో మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ కాలేజీకి భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. వరంగల్‌, హన్మకొండలో రెండు షాదీఖానాలు నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలో వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *