Thursday, 5 November 2026

కడప ఉక్కు కోసం పోరాడాలి: సిపిఐ

కడప,నవంబర్‌13(జ‌నంసాక్షి): కడప ఉక్కుతోనే సీమ సమస్యలు సగం పరిష్కారం అవుతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వివిధ రూపాల్లో సీమ దోపిడీకి గురైందనీ ఆ దోపిడీ ఇప్పటికీ కొనసాగుతోందనీ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం, సమగ్రాభివృద్ధి కోసం ప్రజానీకం రాయలసీమ ఉద్యమాన్ని ఇకనైనా కొనసాగించకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాయలసీమ వెనుకబాటుకు ఈ ప్రాంతంలో జరిగిన కుట్రలే కారణమన్నారు. రాష్ట్ర రాజధాని మొదలు ఆంధ్ర యూనివర్శిటీ, అనేక నీటి ప్రాజెక్టులను కుట్రల ద్వారా కోస్తా పాలకవర్గాలు తరలించుకుపోయాయనీ సీమకు దక్కనీయకుండా చేశాయనీ విమర్శించారు. ఇప్పటికైనా సీమ ప్రజలు అభివృద్ధి నినాదంతో ఐక్య ఉద్యమాలు నిర్మించాలన్నారు. ఉక్కు ఫ్యాకటరీ స్థాపిస్తామని విజభజనచట్టంలో పేర్కొన్నా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఇదొక్కటే ఇక్కడి నిరుద్యోగులకు పరిష్కారం చూపగలదని అన్నారు. పాలకులు ఈ ప్రాంతంలో రైతులు, అట్టడుగు వర్గాలకూ తీరని అన్యాయం చేశారన్నారు.అనేక కరవులూ, ఫ్యాక్షనిజాన్ని ఎదుర్కొన్న సీమ అభివృద్ధికి నోచుకోలేదన్నారు.