ఫేస్‌బుక్ వేదికగా ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధంపై చర్చ
హైదరాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): అత్యుత్తమ రాజకీయ నేత కరుణానిధిని కోల్పోయామని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఆవేదన చెందారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.
తనతండ్రి దివంగత ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణ ఫేస్‌బుక్ వేదికగా సంతాపం తెలిపారు. ‘కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కల్గిన మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని బాలకృష్ణ అన్నారు.




