Tuesday, 3 November 2026

కరోనా తీవ్రత తగ్గుతున్నా..జాగ్రత్తలు పడాల్సిందే

పండగల వేళ మరింత అప్రమత్తత అవసరం

షాపింగ్‌ల పేరుతో విచ్చలవిడిగా తిరగొద్దు

మాస్కులు దరించడం మరవొద్దు

చలి తీవ్రత..బాణాసంచాతో శ్వాసకోస వ్యాధులు

హెచ్చరించిన వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్‌

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కోవిడ్‌ తీవ్రత మరింత తగ్గిందని కోఠి కమాండ్‌ సెంటర్‌ డీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అయితే ప్రజలు పండగల వేళ మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. దీపావళితో పాటు చలి కూడా పెరిగిందని… చలి పెరిగితే వైరస్‌ ప్రభలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, చలి వల్లే వైరస్‌ కేస్‌లు పెరగడంతో పాటు, మరణాలు సంభవిస్తున్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు .శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కేసుల తగ్గుదలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. 1200 రాపిడ్‌, 310 మొబైల్‌ టెస్టింగ్‌ సెంటర్స్‌ ద్వారా టెస్ట్‌లు చేస్తున్నట్లు చెప్పారు. తామే ప్రజల దగ్గరకు వెళ్లి టెస్ట్‌లు మొబైల్‌ వ్యాన్స్‌తో చేస్తున్నట్లు వెల్లడించారు. దీపావళి సందర్భంగా బాణాసంచాలను బ్యాన్‌ చేశారని.. అయితే వ్యాపారులకు ఇది ఇబ్బందికర సమస్య కానీ ప్రజల ప్రాణాలు అంతకన్నా ముఖ్యమని స్పష్టం చేశారు. ఏటా దీపావళి తరువాత శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రజలు ఫైర్‌ క్రాకర్స్‌ లేకుండా ఈ ఏడాది దీపావళి జరుపుకోవాలని కోరారు. పెళ్లిళ్లలోను బాణసంచా కాల్చవద్దన్నారు. పండుగల సమయంలో షాపింగ్స్‌కు ఎక్కువగా వెళ్తున్నారని ఆయా సమయాల్లో తప్పక కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. మాట్లాడేప్పుడు మాస్క్‌ని తీసివేయడం సరికాదన్నారు. మాస్క్‌ను గడ్డం కిందకి వేసుకోవడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏ వాక్సిన్‌ కూడా ఏడాది కాలంలో అందుబాటులోకి రాలేదని…. చాలా ఏళ్ళ పరిశోధనలు జరగాల్సి ఉంటుందని తెలిపారు. కోవిడ్‌ కారణంగా వ్యాక్సిన్‌ను అతి తక్కువ కాలంలో వచ్చేలా శాసత్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్నారు. ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస్‌ సూచనలు చేశారు. ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల కొవిడ్‌ కేసులు చాలావరకు తగ్గాయన్నారు. చలి పెరిగితే కరోనా వైరస్‌ ప్రబలే అవకాశం ఉందన్నారు. దీపావళి తర్వాత శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయన్నారు. బాణసంచాకు దూరంగా ఉండాలని సూచించారు. దీపావళి, శుభకార్యాల కోసం షాపింగ్‌ చేస్తున్న నేపథ్యంలో జనం రద్దీ ఉన్న చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముక్కు, నోరును పూర్తిగా కప్పి ఉంచేలా మాస్కు ధరించాలన్నారు. ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.