Friday, 6 November 2026

కర్నాటకలో బోల్తా కొట్టిన బిజెపి

విశ్వాస పరీక్షకు ముందే చేతులెత్తేసిన యెడ్యూరప్ప 
– సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా
పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌
తమకు తగినంత మెజార్టీ లేదని వెల్లడి
అసెంబ్లీలో భావోద్వేగమైన ప్రసంగం చేసిన యడ్యూరప్ప
ఐదేళ్లలో రైతులను కాంగ్రెస్‌ ఇక్కట్లకు గురిచేసిందని ఆరోపణ
రైతులకు, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో సీఎంను అయ్యా
తమకు అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉంటా
వారికోసం ఎంతకైనా పోరాడతానని వెల్లడించిన యడ్యూరప్ప
వెంటనే గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేసిన యెడ్డీ
దక్షిణాదిలో కాలుమోపాలన్న యత్నాలకు గండి
బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కన్నడనాట బిజెపి భంగపాటుకు గురయ్యింది. బేరసారాల రాజకీయాలకు అవకాశం లేకపోవడంతో బొక్కబోర్లా పడింది. బలం నిరూపించుకుంటానన్న యెడ్యూరప్ప చేతులెత్తేశాడు. సుప్రీం దెబ్బతో బేరాల ఆటలు సాగకపోవడంతో సిఎం పదవిలో ఒదిగి పోవచ్చనుకున్న యెడ్యూరప్పకు ఆలస్యం కాకుండానే అలసు రంగు తెలిసి వచ్చింది.  దీంతో కన్నడనాట ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతకు తెరపడింది.. ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా క్షణక్షణం ఉత్కంఠతకు దారితీసిన కన్నడ రాజకీయాలకు క్లైమాక్స్‌ అదరింది. విపక్షాల ఐక్యత విజయం సాధించింది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారిన కర్నాటకలో ఓ రకంగా బిజెపి చేతులు కాల్చుకుంది. తనకు తిరుగలేదని ఢంకా బజాయించిన మోడీ ద్వయానికి తొలిదెబ్బ తాకింది.  శనివారం సాయంత్రం వరకు తమకు తగినంత బలం ఉందంటూ చెప్పుకొచ్చిన సీఎం యడ్యూరప్ప బలపరీక్ష సమయంలో అసెంబ్లీలో సుధీర్ఘ ప్రసంగం చేసిన అనంతరం తమకు తగినంత బలం లేదంటూ చేతులేత్తేశారు. తన సీఎంపదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌- జేడీఎస్‌ల కూటమికి అధికార పీఠం దక్కినట్లయింది. మధ్యాహ్నం 3.30గంటలకు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే యడ్యూరప్ప బలపరీక్ష తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాంగ్రెస్‌ పాలనను తూర్పార పట్టారు. ఐదేళ్లు కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను, అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. రైతుల ఇక్కట్లు, సాదకబాధకాలు తాను స్వయంగా వీక్షించానని, వారికి తగినంత చేయలేక పోయాననే బాధ తనకు ఉండేదని చెప్పారు. తాను సీఎం పగ్గాలు చేపట్టగానే వారికి ఎంతో చేయాలనే తపన కనబరిచానని అన్నారు. బీజేపీకే ప్రజలు పట్టం కట్టారని, 40 సీట్ల నుంచి 104 సీట్లకు ఎదగడం ద్వారా ప్రజలు తమకే పట్టం కట్టారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్‌షా ఆశీర్వాదం వల్లే తాను సీఎం అయ్యానని అన్నారు. కర్ణాటకకు నిజాయితీ కలిగిన రాజకీయ నేతలే కావాలని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఎంతో నమ్మకం ఉందని, కర్ణాటక ప్రజల పట్ల మోదీకి ఎంతో గౌరవం, వారికి ఎంతైనా చేయాలనే తపన ఉందని యడ్యూరప్ప చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని 28 సీట్లలో గెలిపిస్తానని ఆయన చెప్పారు. ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురయ్యారు. చివరగా…సంఖ్యాబలం నిరూపించుకోవడంలో తాను విఫలమయ్యానంటూ రాజీనామాను ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ నుంచి
నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి యడ్యూరప్ప గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందేశారు.
ఉదయంనుంచీ కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నా.. కొద్దీ ఉత్కంఠతను రేకెత్తించాయి. క్షణక్షణానికి కర్ణాటక రాజకీయ సవిూకరణాలు మారిపోతూ వచ్చాయి.. బలపరీక్షలో ఎలాగైనా నెగ్గుతామని భారతీయ జనతా పార్టీలో కొత్త ధీమాను వ్యక్తం చేసింది. ఉదయం 11గంటలకు కర్ణాటక విధానసభ ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే ప్రొటెస్‌ స్పీకర్‌ బోపయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా 195 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా, మరో 26 మంది సభ్యులు ప్రమాణ
స్వీకారం చెయ్యలేదు. వీరు సభకు హాజరుకాకపోవటంతో ప్రమాణస్వీకారం చేయలేక పోయారు. దీంతో ప్రమాణ స్వీకారాల అనంతరం 1.30గంటలకు సభను వాయిదా ప్రొటెస్ట్‌ స్పీకర్‌ వాయిదా వేశారు. వాయిదా అనంతంర తిరిగి 3.30గంటలకు ప్రారంభమైన సభలో మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారాలు ముగిసిన అనంతరం 3.40గంటలకు సీఎం యడ్యూరప్ప ప్రసంగించారు.
హైడ్రామా..
అంతకు ముందు కర్ణాటక విధానసభలో హైడ్రామా నడిచింది. ఉదయం 11గంటలకు విధాన సభ ప్రారంభం కాగా సభకు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే హాజరు కాలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్‌, ప్రతాప్‌గౌడ్‌ల  కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. ఉదయం నుంచి వారెక్కడున్నారనేదానిపై ఆరా తీశారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగళూరులోని గోల్డెన్‌ ఫించ్‌ ¬టల్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ¬టల్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ¬టల్‌ మొత్తం తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటక డీజీపీ నీలమణిరావ్‌ ఆ ¬టల్‌కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. దీంతో వారిద్దరు అక్కడే ఉండటంతో కాంగ్రెస్‌ నేతలు వెళ్లి వారిని తమవెంట తీసుకొచ్చారు. మరోవైపు ఇక కనిపించకుండా పోయిన గాలి సోదరుడు సోమశేఖర రెడ్డి కోసం కూడా వెతుకులాట చేపట్టారు. కాగా మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభమైన విధానసభలో గాలి సోమశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఇదిలా ఉంటే అప్పటి వరకు ¬టల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మిగిలిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో కలిసిపోయారు. ప్రతాప్‌ పాటిల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డి.కె. సురేష్‌, దినేష్‌ గుండురావుతో కలిసి భోజనం చేశారు. మరోవైపు ఆనంద్‌ సింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసిపోయి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
విధాన సౌధ చుట్టు కట్టుదిట్టమైన భద్రత..
కర్నాటక విధానసౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు భారీ ఎత్తున ప్రత్యేక బలగాలను మోహరించారు. బలపరీక్ష సజావుగా సాగాలన్న ఉద్దేశంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విధాన సౌధ వైపు పబ్లిక్‌ ఎంట్రీని నిలిపేశారు. పూర్తి చెకింగ్‌ తర్వాతనే కేవలం సెక్రటేరియేట్‌ సిబ్బందిని మాత్రమే లోనికి వెళ్లనిస్తున్నారు. అసెంబ్లీకి చెందిన 120 మంది మార్షల్స్‌తో పాటు మండలికి చెందిన 80 మంది మార్షల్స్‌ కూడా భద్రత నిర్వహించారు.
బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆడియో టేప్‌లు..
ఎలాగైనా తమ పంతాన్ని నెగ్గించుకోవాలని చూసిన బీజేపీ నేతలకు బలపరీక్షకు ముందు కాంగ్రెస్‌ చుక్కలు చూపించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు చేసిన యత్నాలను ఎప్పటికప్పుడు రికార్డు చేసిన ఆడియోటేపులను ఒక్కటిక్కటిగా విడుదల చేసి బీజేపీ శిబిరంలో కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం గాలి జనార్దన్‌రెడ్డి ఆడియో టేపును విడుదల చేసిన కాంగ్రెస్‌.. శనివారం
ఉదయం నుంచి వరుసుగా నాలుగురి బీజేపీ నేతలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోబాలకు గురి చేసిన ఆడియోటేపులను విడుదల చేసింది. ఉదయం సీఎం యడ్యూరప్ప కుమారుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో మంతనాలు చేసిన ఆడియోటేపును విడుదల చేసిన కాంగ్రెస్‌.. ఆ వెంటనే యడ్యూరప్ప బిసీ పాటిల్‌తో ప్రలోబాలకు గురిచేస్తూ చేసిన మంతనాలను విడుదల చేసింది.. దీనికితోడు బీజేపీ నేత శ్రీరాములు పలువురి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో మంతనాలు చేసిన ఆడియోటేపును కాంగ్రెస్‌ సోషల్‌ విూడియాలో పెట్టడంతో జాతీయ, ప్రాంతీయ ఛానెళ్లు ప్రసారం చేయడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా
చర్చనీయాంశంగా మారింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఒకానొక దశలో బీజేపీ అగ్రనేతల నుండి రాష్ట్ర నాయకత్వాన్ని మందలించినట్లు సమాచారం. ఇలాంటి పనులు చేసి ప్రజల్లో  పార్టీ పటిష్ఠతను దెబ్బతీయవద్దని గట్టిగా యడ్యూరప్ప టీంకు అధిష్టానం హెచ్చరించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఆ ఆడియో టేపులు తమవి కావని, కాంగ్రెస్‌నేతలు కావాలనే అలా సృష్టించారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. చౌకబారు రాకీయాలకు కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
అసెంబ్లీలో అనూహ్య దృశ్యం!
బలపరీక్ష నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మైసూర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. అనంతరం యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి..  సభను ఉద్దేశించి ప్రసంగించారు.
తిరిగి ప్రారంభమైన తర్వాత అసెంబ్లీలో అనూహ్య దృశ్యం కనిపించింది. బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు అసెంబ్లీ గ్యాలరీలో పక్కపక్కనే కూర్చొని కనిపించారు. కాంగ్రెస్‌ నుంచి గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, అశోక్‌ గెహ్లాట్‌, బీజేపీ నుంచి సదానందగౌడ, అనంతకుమార్‌, శోభా కర్లందాజే పక్కపక్కనే కూర్చొని.. సరదాగా మాట్లాడుతూ.. నవ్వులు చిందించడం కనిపించింది. ఇక కాంగ్రెస్‌ ‘మిస్సింగ్‌’ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ ఆ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ పక్కన కూర్చోవడం గమనార్హం.
————————–