కర్నూలు మెడికల్ కాలేజీలో విషాదం..
– మెడికో విద్యార్థి హర్షప్రణీత్ రెడ్డి ఆత్మహత్య
– కొట్టిచంపారని ఆరోపించిన విద్యార్థి తండ్రి
– అందులో వాస్తవం లేదన్న ప్రిన్సిపాల్
కర్నూల్, జులై6(జనం సాక్షి) : ఎంతో మందికి వైద్యం అందించాల్సిన ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కర్నూలు మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షప్రణీత్ రెడ్డి కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకొని కనిపించాడు. చదువులో ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రణీత్ తోటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే ఈ హత్యపై ప్రణీత్ తండ్రి రామంజులు రెడ్డి కాలేజ్ ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. నా కుమారుడు పిరికివాడు కాదు.. కొట్టి చంపారని ఆయన ఆరోపిస్తున్నారు. గతంలో ర్యాగింగ్ చేసి వేదిస్తున్నారని హర్ష చెప్పాడని, కాలేజీలో ఇవి మామూలే పట్టించుకోకుండా బాగా చదువుకొమ్మని నచ్చచెప్పానని రామాంజులు రెడ్డి తెలిపారు. హర్ష మృతిపై కాలేజీ యాజమాన్యం, హాస్టల్ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హర్షప్రణీత్‌ను కొట్టి చంపారనడంలో నిజం లేదు – ప్రిన్సిపాల్
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అవాస్తవమని ప్రిన్సిపాల్ రాంప్రసాద్ అన్నారు. హర్షప్రణీత్‌ను కొట్టి చంపారనడంలో నిజం లేదని తెలిపారు. పోస్టుమార్టంలో వాస్తవాలు బయటకి వస్తాయని ఆయన చెప్పారు. చదువు ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుకుంటున్నామని అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా కౌన్సెలింగ్ ఇస్తామని ప్రిన్సిపాల్ రాంప్రసాద్ వెల్లడించారు.
—————————————-