9స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన చాడ
ప్లాన్ బితో రెడీగా ఉన్నామన్న సిపిఐ నేత
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాకపోతే ప్లాన్ బి అమలు చేస్తామని సిపిఐ ఖరాఖండిగా చెప్పేసింది. ఇంకెంతకాలవిూ దాగుడుమూలతని సిపిఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీట్ల వ్యవహారం తేలకపోవడంతో సీపీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. 9 స్థానాల్లో తాము పోటీకి సిద్ధమని తేల్చిచెప్పింది. రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డితో సమావేశమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, పినపాక, దేవరకొండ, వైరా స్థానాల్లో తాము పోటీకి సిద్ధమని చాడా తెలిపారు. ఒకవేళ పొత్తు అంశం త్వరగా తేల్చకపోతే ‘ప్లాన్ బి’ అమలు చేస్తామన్నారు. సీపీఐ చాలా ఓర్పుగా వ్యవహరిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాంగ్రెస్‌లో కనపడటం లేదని విమర్శించారు. 40 సీట్లలో తమకు గెలిపించే.. ఓడించే శక్తి ఉందన్నారు. బలానికి తగ్గట్టే అడుగులు వేస్తామన్నారు. తమ పార్టీ ఎవరితోనూ కలవదని.. తమతోనే ఇతరులు కలిసే అవకాశం ఉందన్నారు. కూటమి ఏర్పాటు చేసిందే తామని.. తమ దగ్గరకే చాలా మంది వస్తున్నారన్నారు. కూటమి బలోపేతానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చామని.. ఆ వైపుగానే అడుగులు వేస్తామన్నారు. మ్యానిఫెస్టో రూపకల్పన బాధ్యతలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌కు అప్పగిస్తామని చెప్పారాయన. మహాకూటమి ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా వర్తింపచేస్తామన్నారు.




