కాంగ్రెస్ గెలిస్తేనే.. ప్రజాస్వామ్యం నిలడుతుంది
– ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్రచేస్తున్నారు
– కేటీఆర్ ఏమోహం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు
– కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్
సూర్యాపేట, అక్టోబర్5 (జనంసాక్షి): హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన శనివారం హుజూర్‌నగర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో పొన్నం మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని, టీఆర్‌ఎస్ వస్తే.. అప్పులు రెట్టింపు అవుతాయని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు నెరవేర్చకుండానే..
కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ హంగు, ఆర్భాటాలే తప్ప.. ఎక్కడా అభివృద్ధి జరుగలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడ వల్లనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని పొన్నం విమర్శించారు. కేసీఆర్ కావాలనే టీఎస్‌ఆర్టీసీని నిర్వీర్యం చేసి, భారీ నష్టాల్లో కూరుకుపోయిందని లెక్కలు చూపి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనీ కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మాదిరిగానే.. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.