కాంగ్రెస్‌ పార్టీ కల్లబొల్లి గ్యారెంటీలు ఇక్కడ చెల్లవ్‌..: మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్‌  విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఫైరయ్యారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని, కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు, కటిక చీకట్లు గ్యారెంటీ అన్నారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతవుతుందని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అని చెప్పారు.దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం తధ్యమని, బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా, ధీమా గల్లంతవుతాయన్నారు. సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం తప్పదని వెల్లడించారు. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీనెక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేస్తారని తెలిపారు. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటేబూడిద మిగలడం గ్యారెంటీ అని, స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోతాడని, పరిపాలన చేతగాని, చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ అన్నారు. పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే పరిశ్రమలు పారిపోతాయని, బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు. విషయం, విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనమే మిగులుతుందని, థర్డ్ గ్రేడ్ నాలాయకులను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం అధమస్థాయికిపోవడం గ్యారెంటీ అన్నారు. ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో గలవడం తథ్యమని.. జోకర్లకు, బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్ఠలు గంగలో కలుస్తాయన్నారు. దాచి.. దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది తెలంగాణ కాదని, ఈనగాచి నక్కల పాల్జేసేంత అమాయక నేల తెలంగాణ కాదంటూ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

తాజావార్తలు