మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం
కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ
బిచ్కుంద (జనంసాక్షి) వాడవాడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరియు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు 11 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబరు వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపు ఇవ్వడంతో జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, జుక్కల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సౌదాగర్ గంగారాం నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో గల రుశెగావ్, సుల్తాన్ పెట్, మేనూర్, డోంగ్లి, మోఘ, లచ్ఛన్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి జెండా పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ ఉన్న తమ జుక్కల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్, దళితులకు 3 ఎకరాల భూమి ఊసే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తానెప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయపడ్డానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 58 సంవత్సరాలు దాటిన వృద్ధులకు 2 వేల రూపాయలు, వికలాంగులకు 3 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా పండుగలో భాగంగా గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఇల్లు, వాహనాలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరుతున్న సుమారు 50 మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సాహెబ్ రావు, విఠల్ గురూజి, బాబు పటేల్, సలీమ్, రయీస్ ఖాన్, గజానంద్ పటేల్, యునూస్ పటేల్, గంగారాం పటేల్, మొహ్మద్ అబ్బు మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




