విజయవాడ,నవంబర్2(జనంసాక్షి): కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలోని విద్యానగరం వద్ద బిపిసిఎల్ గ్యాస్ సిలిండర్లు లోడింగ్ కంపెనీ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. తమయను విధుల్లోకి రానివ్వకుండా అడ్డుపడటంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో సహా నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 2004 నుండి 32 మంది ఆన్లైన్, గ్యాస్ సిలిండర్లు లోడింగ్ కు 26 మంది, గార్డెన్ నిర్వహణకు నలుగురు, క్యాపులు కట్టే వాళ్ళు ఇద్దరు, ఆఫీసు బాయ్ ఒకరు, ఎలక్ట్రిషియన్స్ నలుగురు మొత్తం కాంట్రాక్టు పద్దతిలో 69 మంది పనిచేస్తున్నామని, అకారణంగా తమను తొలగించారని పేర్కొన్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు కార్మికులకు అండగా నిలిచినట్లు కార్మికులు తెలుపుతున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.




