వరంగల్,ఫిబ్రవరి26(జనంసాక్షి): గురుకుల పాఠశాల్లో అయిదో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని బోధించడం వల్ల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పుల్లయ్య చెప్పారు. 2015-2016 విద్యాసంవత్సరంలో అయిదో తరగతిలో ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్షా ప్రకటనను విడుదల చేశామని చెప్పారు. అయిదో తరగతిలో ప్రవేశం కోసం అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ నెల 16 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వేసవిలో విద్యార్థులు ఇంటి వద్ద ఇతర కూలి పనులకు వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలకు చెందిన పది వేల మంది విద్యార్థులకు మే ఒకటి నుంచి 15 వరకు హైదరాబాద్‌లో వివిధ వృత్తులపై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని అన్నారు. దీనికి తల్లిదండ్రలు కూడా ప్రోత్సహించాలన్నారు.




