Tuesday, 3 November 2026

కాలుష్యంతో కళ తప్పుతున్న తాజ్‌మహల్‌

6
గుర్తించిన అమెరికా భారత్‌ నిపుణులు

వాషింగ్టన్‌  డిసెంబర్‌11 (జనంసాక్షి) :: ప్రపంచంలో ఏడు వింతలలో ఒకటైన తాజ్‌మహాల్‌ కళ తప్పుతుంది. ప్రపంచ ప్రఖ్యాత అందాల తాజ్‌మహల్‌ ధవళ తేజస్సు మసకబారుతోంది. వాయుకాలుష్యంలోని కర్బన రేణువులు, దుమ్ము తాజ్‌మహల్‌ రంగు వెలసిపోయేలా చేస్తున్నాయని భారత, అమెరికా పరిశోధకులు గుర్తించారు. మెరిసే తెల్లని రంగు కాస్తా గోధుమ వర్ణంలోకి మారిపోతున్నట్లు తేల్చారు. జీవ పదార్థాలు, శిలాజ ఇంధనాల దహన క్రియ నుంచి వెలువడే కర్బనం, దుమ్ము వంటి కాలుష్య కారకాలు తాజ్‌మహల్‌ రంగు వెలసిపోయేలా చేస్తున్నట్లు జార్జియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆచార్యులు మైకేల్‌ బెర్గిన్‌ పేర్కొన్నారు. జార్జియా పరిశోధకులతోపాటు ఐఐటీ కాన్పూర్‌, భారత పురావస్తు సర్వే సంస్థ, విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుపై కలసి పనిచేశాయి. రంగు మారడానికి వాయుకాలుష్యమే కారణమని అనుమానిస్తున్నా దీనిపై పద్ధతి ప్రకారం అధ్యయనం మాత్రం జరగలేదు. ఈ మేరకు రంగు మారడానికి కారణమేమిటో గుర్తించేందుకు పరిశోధకులు తాజ్‌మహల్‌ సముదాయంలో 2011 నవంబరు నుంచి 2012 జూన్‌ వరకు వాయు నమూనాలు సేకరించే పరికరాలను ఉపయోగించారు. వాయు నమూనాల పరికరాల వడపోత సాధనాల నుంచి అతిసూక్ష్మ పదార్థాలను విశ్లేషించారు. తాజ్‌మహల్‌లోని ప్రధాన గుమ్మటానికి సమీపంలో పలుచోట్ల సహజమైన మార్బుల్‌ నమూనాల్ని ఉంచారు. వాయు కాలుష్యాల ప్రభావానికి లోనైన నమూనాల్ని సూక్ష్మదర్శినితో పరిశీలించి, సూక్ష్మరేణువుల పరిమాణం, సంఖ్యను విశ్లేషించారు. ఈ సమాచారం సూక్ష్మరేణువుల కూర్పును తెలుసుకునేందుకు తోడ్పడినట్లు బెర్గిన్‌ పేర్కొన్నారు. దుమ్ము, గోధుమ రంగుతో కూడిన జీవ కర్బనాలను, నల్లని కర్బనాలను వడపోత సాధనాలు, మార్బుల్‌ నమూనాలపై గుర్తించారు. కర్బన రేణువులు చమురు దహనక్రియ, వంట, ఇటుకల తయారీ, వ్యర్థపదార్థాల దహనం, వాహనాల పొగ నుంచి వెలువడుతున్నట్లు గుర్తించారు. వ్యవసాయ కార్యకలాపాలు, వాహనాల రద్దీ నుంచి దుమ్ము వస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *