హైదరాబాద్: కావేరీ నదీ జలాల వివాదంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమిళనాడు, కర్ణాటక మధ్య తరచూ కావేరీ నీటి వివాదం ఇబ్బందిగా ఉందన్నారు. ఆందోళనల పేరిట ఆస్తులను ధ్వంసం చేయడం మంచిదికాదని సూచించారు. ఆందోళనల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆందోళనలతో సమస్య పరిష్కారం కాదని… సామరస్యపూర్వక చర్చలు అవసరమని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు, విధ్వంసం ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ వివాదంలో సామాన్య ప్రజలకు భాగస్వామ్యం లేదు, భాష ఆధారంగా దాడుల వల్ల నష్టపోయేది సామాన్యులు, పేదవాళ్లే. శాంతిని పునరుద్దరించడం కోసం ప్రజలు సహకరించాలని రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరారు. పొరుగు రాష్ట్రాల వారి ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రెండు రాష్ట్రాల సీఎంలు చెప్పారని వెంకయ్య తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దాడి దృశ్యాలను పదే పదే చూపించడం వల్ల ప్రజల్లో భావోద్వేగాలు పెరిగే అవకాశముందన్నారు. కావేరీ జలాల వివాదం సోమవారం కర్ణాటక, తమిళనాడుల్లో భారీ విధ్వంసానికి దారితీసిన విషయం తెలిసిందే. హింస పేట్రేగిన బెంగళూరు లోని 16 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
కావేరీ వివాదంపై స్పందించిన వెంకయ్య




