గుర్తింపు ఉందాలేదా చూసుకోండి
హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): వేసవి సెలవుల అనంతరం ఈ నెల 11న ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్పించాలన్న మోజుతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పరుగులు పెడుతున్నారు. ఆకర్శణీయమైన బ్రోచర్లు హంగామా చూసి మోసపోతున్నారు. దానికి గుర్తింపు ఉందా లేదా అన్నది చూడడం లేదు. ఈనేపథ్యంలో ఒక్కసారి తమ పిల్లలను చేర్పించబోయే పాఠశాల ఎంత సురక్షితం.. బోధన ఎలా ఉంటుంది.. చిన్నారుల మనోవికాసం కలిగించే ఆటపాటలకు మైదానం ఉందా.. అన్నది ఆలోచించాల్సి ఉంది. ఆటపాటలతో పాటు అధ్యాపకులు, తగని వసతులు ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి. కేవలం అడ్వర్టయిజ్మెంట్ ఆకర్శణతో కాకుండా పాఠశాల గత చరిత్రను కూడా గమనిస్తే మంచిది. గతంలో సాధించిన ఫలితాలు, టీచర్ల సంఖ్య, పాఠశాల ప్రమాణాలు చూడాలి. ఆటపాటలతో కూడిన చదువుతోనే మానసిక పరిపక్వత వస్తుంది. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానాలు విద్యార్థులపై చదువులపై ప్రభావం చూపుతాయి. నిబంధనల ప్రకారం నిర్మించిన పాఠశాలల భవనాలు సురక్షితం. పాఠశాలకు ఉండాల్సిన నిబంధనలు, అర్హతలు, హంగులు, అనుమతులను గుర్తించకుంటే తరవాత బాధపడి లాభం ఉండబోదు. పెద్దపెద్ద భవంతులు, హంగులు, ఆర్భాటాలను చూసి పిల్లలను చేర్పిస్తున్నారు. అయితే విద్యార్థులకు రక్షణ ఉందా..? భవనాలు సురక్షితమైనవేనా..? ముఖ్యంగా పాఠశాలకు అనుమతి ఉందా..? తదితరాల గురించి ఆలోచించుకోవాలి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అయితేఅనుమతి లేకుండా నిర్వహిస్తూ మరొక పాఠశాల పేరుతో సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు ఒక్కటి కూడా పని చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా అనుమతిలేని పాఠశాలలు అక్కడక్కడా ఇంకా పుడుతూనే ఉన్నాయి. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా విద్యా వ్యాపారం జోరుగా సాగుతుండటమే అధికారుల తీరుకు నిదర్శనం.అనుమతుల్లేని పాఠశాలల్లో కూడా ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానాలు, తగిన అర్హత గల ఉపాధ్యాయులు, రక్షణ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిమాపక శాఖ, ఆర్ అండ్ బి, పురపాలక శాఖ లేదా గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖల అనుమతి తప్పకుండా ఉండాలి. భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే స్థలం ఉండాలి. అయితే నిబంధనల ప్రకారం వసతులు సమకూర్చడం, అనుమతి పొందడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కొందరు అధికారులను ప్రసన్నం చేసుకొని నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉన్నట్లు నివేదికలు తయారు చేయించుకొని అనుమతులు పొందుతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంటర్మీడియట్తో పాటు డైట్లో శిక్షణ, టెట్లో ఉత్తీర్ణులైన వారు విద్యాబోధన చేయాలి. ఉన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ చేసిన వారు బోధన చేయాలి. తల్లిదండ్రులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారే తప్ప, పాఠశాలల్లో ఉండే నియమ నిబంధనలు, జీవోలను పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రుల్లో ప్రశ్నించే తత్వం పెరిగితే జీవోలు సక్రమంగా అమలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఫీజుల రూపంలో వసూలు చేసే రుసుములో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు, 15 శాతం సాంస్కృతిక కళలు, క్రీడలకు, 10 శాతం సామగ్రికి, 15 శాతం సౌకర్యాలకు, 5 శాతం ఇతర పనులకు ఖర్చు చేయాలి. యాజమాన్యాలు 5 శాతంమాత్రమే లాభాలుగా తీసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్లల్లో తప్పనిసరిగా రుసుము పెంచాలనుకుంటే డీఎఫ్ఆర్సీ (డిస్టిక్ట్ర్ ఫీ కమిటీ సిఫారసులు) అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, నోట్బుక్కులు, బెల్టులు, డ్రెస్సులు తదితర విద్యా సామగ్రిని ఉంచకూడదు. ఎవరికీ ఫలానా చోట కొనుగోలు చేయాలని సూచించకూడదు. కానీ ప్రస్తుతం ప్రతి పాఠశాలల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. పాటశాలలకు టెక్నో తదితర పేర్లు లేకుండా చూడాలి. అయితే తల్లిదండ్రులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటంతో ఆకర్షితులై మోసపోతున్నారు.




