నక్షత్రగమనంతో కార్తెలకు పేరు
హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): సూర్యోదయమప్పుడు ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. మృగశిర కార్తెతో వర్షకాలం ప్రారంభం అవుతుంది. మృగశిర కార్తె పూనిననాడు ఆకాశంలో మృగం తలరూపంలో మూడు నక్షత్రాలు ఒక ఆకారంగా ఏర్పడటం కుతూహలం కలిగిస్తుంది. తొలకరితో ప్రారంభమయ్యే వర్షకాలంలో పొలం పనులు నిర్వహించుకోవడానికి అవసరమయ్యే పశు(మృగ) సంపదను సమాయత్తం చేసుకోవడానికి- ఆకాశంలో మృగశిరస్సు రూపంలో దైవం సంకేతాన్ని అందిస్తాడంటారు. వర్షకాలంలో ఎడతెరిపి లేని వానలవల్ల మనిషికి కొన్ని రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. నేటికీ పల్లెప్రాంతాల్లోనాన్నమ్మలు, అమ్మమ్మలూ పిల్లలకు ఇంగువ బెల్లం కలిపి మృగశిర కార్తె రోజు తినిపించడం ఆచారంగా కొన్ని ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. వర్షకాలంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే పూర్వకాలంనాటి వైద్యుడు గ్రంథస్థం చేశాడు. పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. అందుకే కార్తెలన్నింటిలోనూ మృగశిరకు చాలా ప్రాముఖ్యం ఉంది. అటు పరమాత్మకూ, ఇటు ధరణిపైని లౌకిక వ్యవహారాలకు మృగశిర కార్తె అనుసంధానంగా ఉంటుందన్నది పెద్దలమాట. మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెల మధ్య వచ్చే యోగినీ ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, కుమారషష్ఠి, వైవస్వత సప్తమి అత్యంత పర్వదినాలు. ఇంటిబయట వరుణదేవుడు వర్షపు జల్లులు కురిపిస్తూ చల్లని గాలులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారిస్తే మనస్సు కూడా దైవధ్యానానికి ఆత్రుత పడుతుంది.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును.మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును. మృగశిరకు ముల్లోకాలు చల్లబడును. అన్న నానుడులు వచ్చాయి.
నిని




