– ఏబీవీపీ నేత సుశీల్ కుమార్‌పై దాడి జరుగలేదు
– అప్పెండిసైటిస్ ఆపరేషన్ కోసమే హాస్పిటల్‌లో చేరాడు
– అంబేడ్కర్ వాదులు జాతి వ్యతిరేక శక్తులు కాదు
– సెంట్రల్ వర్సిటీలో అరవింద్ కేజ్రీవాల్
హైదరాబాద్,జనవరి21(జనంసాక్షి): ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌పై ఏఎస్‌ఏ నేతలు దాడి చేయలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతిపై ఐదురోజులుగా హెచ్‌సీయూలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విద్యార్థులను పరామర్శించి, దీక్షకు సంఘీభావం తెలిపారు. సుశీల్‌కుమార్ అపెండిసైడిస్ ఆపరేషన్ చేయించుకున్నారని… దానినే దాడిగా చిత్రీకరించి ఏఎస్‌ఏ నేతలపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఏఎస్‌ఏ అనేది అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా ఏర్పాటైందని… అది జాతి వ్యతిరేక సంస్థ కాదని స్పష్టం చేశారు. ఏఎస్‌ఏ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖ రాయడంతోనే సమస్య తలెత్తిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరణమని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనను పక్కదారి పట్టేందుకు స్మృతి ఇరానీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జై భీమ్ అంటూ సంభోదించి తన ప్రసంగం ఆరంభించారు. రోహిత్ ను ఎబివిపి విద్యార్దులు వేదించారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఆయన విమర్శలు చేస్తూ ఎలాంటి విచారణ చేయకుండానే యూనివర్శిటీలోని అంబేద్కర్ విద్యార్ధి సంఘం విద్యార్దులను జాతి వ్యతిరేకులు,కులవాదులుగా చిత్రీకరించుతారా అని కేజీవ్రాల్ ప్రశ్నించారు.అంబేద్కర్ పేరుతో ఉన్న సంఘం జాతి వ్యతిరేకం ఎలా అవుతుందని ఆయన అన్నారు.రోహిత్ మెరిట్ విద్యార్ది అని, దళిత కోటాలో సీటు తెచ్చుకోలేదని, మెరిట్ పై తెచ్చుకున్నారని అన్నారు.ఇలాంటి విద్యార్దులను కేంద్ర మంత్రి స్మృతి సన్మానించాలని, కాని అందుకు భిన్నంగా వ్యవహరించారని, ఇది సమాజానికి సిగ్గు చేటు అని కేజీవ్రాల్ అన్నారు.ఎబివిపి విద్యార్ధి సుశీల్ పై దాడి జరగలేదని రిజిస్టార్ర్ నివేదిక చెబుతోందని అన్నారు.
బిజెపి విధానాలపై మండిపసడ్డ కేజ్రీవాల్
బిజెపి అనుసరిస్తున్న విధానాల వల్లనే దేశంలో అస్థిరత నెలకొందని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిజెపి ఏ వర్గానికి దగ్గరగా లేదన్నారు. కనీసం హిందువులను కూడా చేరదీయలేకపోయిందన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్ గురువారం పరామర్శించారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు కేజీవ్రాల్ సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ మెరిట్ ఆధారంగానే యూనివర్శిటీలో సీటు సంపాదించాడని…. అంతేకానీ… రిజర్వేషన్లతో అతడు యూనివర్శిటీలో అడుగు పెట్టలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానం అని అన్నారు. హెచ్సీయూలో చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండా విద్యార్థులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని కేజీవ్రాల్ ఆరోపించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ అంశాన్ని దళితులు… ఇతరులకు మధ్య ఘర్షణగా చిత్రీకరించారని విమర్శించారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలతోనే హెచ్సీయూకి కొత్త వీసీ వచ్చారన్నారు. ఏబీవీపీ వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడు సునీల్ కుమార్/-పై ఏఎస్‌ఏ విద్యార్థులు దాడి చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సునీల్ ఆపరేషన్‌కు …ఏఎస్‌ఏ దాడికి సంబంధమే లేదని అన్నారు. యూనివర్శిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ విధానాల కారణంగా పేద, దళిత విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బిజెపి ఫలానా వర్గాన్ని చేరదీస్తుందన్న దానిలో కూడా నిజం లేదని, హిందువులకు కూడా అది దగ్గరగా లేదని అన్నారు. ముస్లిం, దళిత వర్గాలకు కూడా బిజెపి దూరంగా ఉందన్నారు. జై భీమ్ అంటూ సంభోదించి తన ప్రసంగం ఆరంభించారు. రోహిత్ ను ఎబివిపి విద్యార్దులు వేదించారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఆయన విమర్శలు చేస్తూ ఎలాంటి విచారణ చేయకుండానే యూనివర్శిటీలోని అంబేద్కర్ విద్యార్ధి సంఘం విద్యార్దులను జాతి వ్యతిరేకులు, కులవాదులుగా చిత్రీకరించుతారా అని కేజీవ్రాల్ ప్రశ్నించారు. అంబేద్కర్ పేరుతో ఉన్న సంఘం జాతి వ్యతిరేకం ఎలా అవుతుందని ఆయన అన్నారు.
హెచ్‌సీయూలో కొనసాగుతున్న బంద్
పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతి ఘటనపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బంద్ కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్సీయూ విద్యార్థుల జేఏసీ స్పష్టం చేసింది. ఏడుగురు విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం రెండో రోజకు చేరుకుంది. నగర సెంట్రల్ యూనివర్సిటీల్లో వరుసగా ఐదో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల నిరసన జ్వాలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈనెల 17వ తేదీన హెచ్ సీయూ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణమైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ, ఏబీవీపీ నాయకుడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి నష్టపరిహారం అందించాలని, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలని విద్యార్ధుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చాలని విద్యార్థులు బుధవారం నిరవధిక దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్‌ఎస్‌యూఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు. రోహిత్ ఘటనపై పోరును ఉధృతం చేసేందుకు విద్యార్థులు జేఏసీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు పలువురు నేతలు హెచ్‌సీయూకు రానున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హెచ్‌సీయూను సందర్శించనున్నారు. ఇదిలా వుండగా రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఏపీలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో ఆందోళనలు,ర్యాలీలు నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ చేపట్టారు. కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు
కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన నెల్లూరులో మండిపడ్డారు. రోహిత్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కడపలో రోహిత్ ఆత్మకు శాంతి కలగాలంటూ వైఎస్సార్ స్టుడెంట్స్ యూనియన్, వైఎస్సార్ యువజన విభాగం కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.. విద్యార్థుల జీవితాలతో రాజకీయ నేతలు ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కులవివక్ష వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలని సీపీఎం డిమాండ్ చేసింది.. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలు తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు.





