కుంభమేళాకు రండి

– కేటీఆర్‌ను ఆహ్వానించిన యూపీ మంత్రి సతీశ్‌ మహానా
హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) :  2019లో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ కు చెందిన మౌలికవసతుల, పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీశ్‌ మహానా శనివారం
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కోరారు. శనివారం ఆమేరకు తెరాస భవన్‌కు చేరుకున్న సతీశ్‌ మహానా కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ సాగింది. ఈసందర్భంగా కుంభమేళాకు తప్పని సరిగా హాజరు కావాలని సతీశ్‌ మహానా కేటీఆర్‌ను ఆహ్వానించారు. 2019, జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు యూపీలోని అలహాబాద్‌(ప్రయాగరాజ్‌)లో జరగనుంది. ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పవిత్ర గంగా స్నానాల కోసం తరలిరానున్నారు. మహా కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే భక్తుల బసకు ఫంక్షన్‌హాళ్లును వాడుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. జనవరి నుంచి మార్చి వరకు మూడునెలలపాటు పెండ్లిళ్లు తదితర సామూహిక కార్యక్రమాలను జరుపుకోరాదని స్థానిక ప్రజలకు సూచించింది.