– సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్, డిసెంబర్29(జనంసాక్షి) : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గిందని, పటిష్ఠ బందోబస్తు నిర్వహణ ద్వారా, ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఇది సాధ్యమైందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2018 వార్షిక నివేదికను సీపీ సజ్జనార్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 21శాతం నేరాలు తగ్గాయని 2018లో మొత్తం 16,811 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ ఏడాదిలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు తగ్గాయన్నారు. ఈఏడాది 24శాతం శిక్షలు పెరిగాయన్నారు. 2017లో 201కిడ్నాప్ కేసులు నమోదు కాగా, 2018లో 333 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. పేకాటలో 148 కేసులు నమోదు కాగా, 938 మందిని అరెస్టు చేసి రూ. 84 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది 578 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 608 మంది మృతి చెందారు. ఓఆర్ పై 24ప్రమాదాలు జరగ్గా 25మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 14,782 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 4,203 మంది జైలు శిక్ష అనుభవించారన్నారు. 1699 మంది షీటీమ్స్ కు ఫిర్యాదు చేశారని సిజ్జనార్ తెలిపారు. ఈ ఏడాది 14శాతం చోరీ సొత్తు రికవరీ జరిగిందని తెలిపారు. ఆర్థిక నేరాల కేసుల్లో రూ. 244 కోట్ల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశామన్నారు. 282 సైబర్ కైమ్ర్ కేసుల్లో 70 కేసులు చేధించామని వెల్లడించారు. జరిమానాల ద్వారా రూ. 91 కోట్ల 91 లక్షలు వసూలు చేశామని సజ్జనార్ తెలిపారు.
21శాతం నేరాలు తగ్గాయి




