– ఆ దిశగా బీసీ కమీషన్ కృషి చేయాలి
– మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్,అక్టోబర్ 27(జనంసాక్షి): కులాల మధ్య అంతరాలు తొలగాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలను అభివృద్దిలోకి తెచ్చేందుకు సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. బీసీ కమిషన్ ఛైర్మన్, మెంబర్లు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ బీసీ సంక్షేమం కోసం కమిషన్‌ను వేశారని వివరించారు. కొత్త ఛైర్మన్ బీఎస్ రాములు సారథ్యంలో బీసీ కమిషన్ చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలన్నారు. బీసీల సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటి వరకు బీసీల జనాభా ఎంతో సరైన లెక్కలు లేవని ఆవేదనతో అన్నారు. గతంలో పార్టీలు బీసీలను ఓటర్లుగానే చూశాయని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. బీసీలకు కళ్యాణ లక్ష్మి వర్తింపజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. బీసీల్లోని అన్ని వర్గాలకు మంచి జరిగేలా కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీసీల స్థితిగతులపై బీసీ కమిషన్ లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు వినోద్, బాల్క సుమన్, స్పీకర్ మధసూధనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా బీసీ కమిషన్ ఛైర్మన్, దాని సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కమిషన్ ఛైర్మన్‌గా బీఎస్ రాములు, సభ్యులుగా జూలూరి గౌరి శంకర్, అంజనేయులుగౌడ్, వకుళాభరణం కృష్ణమోమన్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్‌రముఖులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న,ఎంపీలు బాల్క సుమన్, వినోద్,ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఛైర్మన్ రాములుకు, ముగ్గురు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంపి వినోద్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అణగారిన వర్గాల అభివృద్దికి నడుం బిగించారని అన్నారు. బిసి కమిషన ఏర్పాటు ఇందులో భాగమన్నారు. తెలంగాణలో బలహీనవర్గాలు ఎక్కువన్నారు. ఇంకా సంచారజాతులను ముందుకు తీసుకుని రావాల్సి ఉందన్నారు.





