హైదరాబాద్,అక్టోబర్26(జనం సాక్షి): నగరంలోని కూకట్‌పల్లి జోన్ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన
కిశోర్ శుక్రవారం ఆకస్మక పర్యటన చేశారు. పారిశుద్ధ్యం, రహదారులు, ఇంజినీరింగ్ పనులను తనిఖీ చేసిన కమిషనర్ మూసాపేట ప్రధాన రహదారిపై చెత్తను తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమార్గాలు, జంక్షన్ల వద్ద రెండుసార్లు చెత్తను తొలగించాలని ఆదేశించారు. అనంతరం మూసాపేట నుంచి గ్రీన్‌హిల్స్ కాలనీ మార్గంలో రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు విస్తరణ సందర్భంగా నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసాపేటలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో మాట్లాడిన దాన కిశోర్.. ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.




