Monday, 2 November 2026

కూటమి కుట్రలను తిప్పికొట్టండి

– తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెరాస
– ఓటు అడిగే హక్కు తెరాస పార్టీకే ఉంది
– కూటమి నేతల మాటలు నమ్మి మోసపోవద్దు
– ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : తెలంగాణ వ్యతిరేఖ పార్టీ టీడీపీతో కలిసి కాంగ్రెస్‌, మరో రెండు పార్టీలుమహాకూటమిగా ప్రజల్లోకి వస్తున్నాయని, వారి కుట్రలను తిప్పికొట్టాలని ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావుఅన్నారు. వనపర్తి జిల్లా కదిరేపాడ్‌ గ్రామంలో బుధవారం జూపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని వారు ఇప్పుడు అధికారమిస్తే చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెరాస అని.. ఓటు అడిగే హక్కు ఆ పార్టీకే ఉందన్నారు. సమైక్య పాలనలో అన్యాయం చేసిన కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి మాటలు నమ్మిమోసపోవద్దని ప్రజలకు సూచించారు. అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న తెలంగాణను అణచి వేయడానికి మళ్లీ కుట్రలు జరుగుతున్నాయన్నారు. నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి.. 67 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని ప్రజలకు సూచించారు. మరోసారి తెరాసకు అధికారమిస్తే మరింత అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు.
నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో ఎన్నో సంక్షేమపథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెరాస ప్రభుత్వం చేసి చూపిందన్నారు. రైతులకు పెద్దపీట వేస్తూ 24 గంటల నిరంతర విద్యుత్తు, పెట్టుబడిసాయం, రైతుబీమా తదితర అంశాలు అమలు చేశామన్నారు. దీంతో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, సీఎం సహాయ నిధి పథకాలతో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేస్తోందని పేర్కొన్నారు. తెరాస అభివృద్ధి పథకాలను చూసి మరోసారి గెలిపించాలని జూపల్లి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేశ్‌, జడ్పీటీసీ సభ్యుడు రవి, తెరాస నాయకులు గోవర్ధన్‌, రామకృష్ణ, సుధాకర్‌, తిరుపతయ్య, జగదీశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.