– ప్రధాని పదవిపై నాకు ఆశలేదు
– విభజన హావిూలు అడిగితే ఐటీ వేధింపులా?
– మోడీని ప్రశ్నించాలంటే జగన్, పవన్ భయపడుతున్నారు
– పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు
– రాజకీయం అంటే సినిమా స్కిప్ట్ కాదని గుర్తుంచుకోవాలి
– అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా చేస్తాం
– కులమతాలను, ప్రాంతాలను చూసి కాదు.. అభివృద్ధిని చూసి ఓటేయండి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ప్రకాశం, నవంబర్3(జనంసాక్షి) : రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, విభజన హావిూలను అమలు చేయాలని కోరితే కేంద్రం ఐటీ దాడులతో వేధిస్తోందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఇక కేంద్రాన్ని అడుక్కుంటే లాభం లేదనీ, ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం డేగరమూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన శనివారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి చంద్రబాబు హాజరై మాట్లాడారు. ప్రధాన మంత్రి పదవిపై తనకు ఆశలేదని స్పష్టం చేశారు. గతంలోనే నాకు రెండు సార్లు అవకాశం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్నికల విషయంలో బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. అవసరం లేకపోయినా అవినీతి పార్టీని లోబరుచుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. ఇక కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే దేశం మొత్తం తిరిగి మద్దతు తీసుకువస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించలేదని సెటైర్లు వేశారు. గతంలో దేశానికి సమస్య వస్తే టీడీపీ దారి చూపిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ ఓ రాజకీయ పార్టీ కాదనీ, అది ఓ వ్యవస్థ అని అన్నారు. ధర్మం, న్యాయం కోసం పోరాడాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ సోషల్ విూడియా విభాగం సీబీఎన్ ఆర్మీ అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. రాష్ట్రంలో కోడికత్తి, జల్లికట్లు, పోలవరం కాలువలు తెగ్గొట్టడం, అసెంబ్లీకి రాకపోవడం, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేయడం వంటి పనులకు ప్రతిపక్షం పరిమితమయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు తనకు ఓటేయాలని, ప్రతిగా వారి ఆదాయం, జీవనప్రమాణాలు పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని హావిూ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, రాజకీయం అంటే సినిమా స్కిప్ట్ కాదన్నారు. పవన్, జగన్‌కు మోదీ అంటే భయమని, అందుకే బీజేపీని విమర్శించరని అన్నారు. ఒకరికి కేసుల భయం, మరొకరికి నల్లధనం భయమని ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ ఎక్కడ జైల్లో పెడతారో అని జగన్, పవన్ భయపడుతున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడే వారే కేసులకు భయపడతారని, తనకు భయం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా చేస్తామని తెలిపారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా రాజధాని నిర్మాణం చేపడతామని, తాను ఏది ఆలోచించినా దేశ భవిష్యత్తు కోసమేనన్నారు. కులం, మతం, ప్రాంతం పేరు చెప్పి ఓట్లు వేయటం కాదని, అభివృద్ధిని
చూసి ఓటు వేయండని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి అత్యంత దగ్గరగా ఉండే నగరంగా ఒంగోలు రూపాంతరం చెందుతుందన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధిలో నంబర్ 1 జిల్లాగా చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు.
కేంద్రాన్ని అడుక్కుని లాభంలేదు.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం!




