Friday, 6 November 2026

కృష్ణానదిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

– నదులను రక్షించుకోకపోతే  భవిష్యత్‌ తరాలకు నష్టం
– కాళేశ్వరం ప్రాజెక్టుతో 37లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం
– మిషన్‌ కాకతీయతో భూగర్భజలాలు పెరిగాయి
– 62శాతం చేపల ఉత్పత్తి పెరిగింది
– భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌
హైదరాబాద్‌, మే22(జ‌నం సాక్షి) : దేశంలో నాలుగో అతిపెద్ద నది కృష్ణానది అని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన కృష్ణా నది పునరుజ్జీవ జాతీయ సదస్సు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 365 రోజుల పాటు నీళ్లు ఉంటాయని, దేశంలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధిక నిధులు విడుదల చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని హరీష్‌ రావు చెప్పారు. నదుల పునరుజ్జీవానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ చేపట్టిందని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో ఆరు వేల చెరువులను పునరుద్ధరించామని మంత్రి చెప్పారు. మిషన్‌ కాకతీయ వల్ల తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని, అలాగే చేపల ఉత్పత్తి 62శాతం పెరిగిందని అన్నారు. మిషన్‌ కాకతీయతో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగిందని పేర్కొన్నారు. హరితహారంతో చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టామని, మానేరు, మూసీనదుల పునర్జీవనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హరీష్‌రావు తెలిపారు. కృష్ణా నీటివినియోగంలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. వందేళ్లుగా నిరీక్షిస్తోన్న కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తిచేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. కోయిన డ్యామ్‌ నుంచి ప్రతీ ఏటా కర్ణాటక 100 టీఎంసీల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగిస్తోందని, అనంతరం ఆ నీరు పూర్తిగా అరేబియా సముద్రంలో వృధాగా కలుస్తోందన్నారు. అది వృధా కాకుండా చూస్తే అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని సూచించారు. నదులను కాపాడుకోకపోతే భాష్యత్‌ తరాలకు తీరని నష్టం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. కృష్ణా బేసిన్‌లో వర్షపాతం తక్కువగా ఉండటం.. కృష్ణా నీటిని వాడుకోలేకపోవడంతో అక్కడి ప్రజలు గతంలో వలస వెళ్లారని, కృష్ణా నది నుంచి 6 లక్షల 50వేల ఎకరాలకు సాగునీటిని అందించామన్నారు. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి వరల్డ్‌ వాటర్‌ కౌన్సిల్‌ గవర్నర్‌ పృథ్వీరాజ్‌ సింగ్‌, మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌సింగ్‌, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి. ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.