Saturday, 7 November 2026

కెసిఆర్‌ను ఓడించి గజ్వెల్‌ను కానుకగా ఇస్తా

 

మేడ్చెల్‌ సభలో వంటేరు ప్రతాపరెడ్డి ప్రతిన

మేడ్చల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కిన కెసిఆర్‌ను గజ్వెల్‌లో ఓడించి సోనియాకు కానుకగా ఇస్తానని కాంగ్రెస్‌ నేత, గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. కెసిఆర్‌ను ఇక ఫామ్‌ హౌజ్‌కే పరిమితం చేస్తామని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని వంటేరు ప్రతాప్‌ రెడ్డి మండిపడ్డారు. మేడ్చల్‌ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెదేపా హయాంలో 9, కాంగ్రెస్‌ హయాంలో 5 డీఎస్సీలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బంగారు తెలంగాణ చేస్తానని పదేపదే చెప్పిన

కేసీఆర్‌ వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదన్నారు. దళితుడిని సీఎంని చేస్తానన్న కేసీఆర్‌.. విూరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెలలోనే సమగ్ర సర్వే చేశారని, ప్రజలంతా ఆ రోజు ఇంట్లో ఉండి అధికారులకు సహకరిస్తే.. ఆ సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో భూమిలేనోళ్లకు భూమి రాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగం రాలేదన్నారు. సమగ్ర సర్వే ఓ ఫాల్స్‌ సర్వే కాదా? కేసీఆర్‌ ప్రజల్ని మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరికి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు వస్తే దానిపై ఒక్కసారైనా సీఎం మాట్లాడలేదన్నారు. ఖమ్మంలో రైతులు తిరగబడితే సంకెళ్లు వేసి జైలుకు పంపారని మండిపడ్డారు. కవిత బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవాలన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌, సోనియా, రాహుల్‌, ఉత్తమ్‌ కుమార్‌కు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకు ప్రజలంతా చేయి చేయి కలపాలని విజ్ఞప్తి చేశారు.