బర్లు, గోర్లు ఇచ్చి అవమానించారు
పేదవర్గాలను ఉన్నతోద్యాగాలకు దూరం చేశారు
కాంగ్రెస్ గెలుపుతో నిరుద్యోగ సమస్య తీరుస్తాం: కృష్ణయ్య
మేడ్చల్,నవంబర్23(జనంసాక్షి): కేసీఆర్ ప్రజాకంటక పాలనను పారద్రోలేందుకు ఇది సంధి కాలమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. కృష్ణయ్య అన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. కానీ కెసిఆర్ గత నాలుగేళ్లుగా ఎవరికి ఉద్యోగాలు రాకుండా గొర్లు,బర్లు ఇస్తూ పాలించుకోమని చెప్పారని అన్నారు. తామంతా గత 40 ఏల్లుగా వెనకబడిన బడుగు బలహీనవర్గాల వారు చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేయాలని ఆకాంక్షించామని, వాటిని కెసిఆర్ తుంగలో తొక్కారని అన్నారు. అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. రైతులెవరూ రుణాలు కట్టొద్దని సూచించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆనాడు అన్నారని, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని కృష్ణయ్య ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు తీరాలంటే కేంద్రం, రాష్టాల్లో సుస్థిరమైన ప్రభుత్వంరావాలన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌వైపే ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 80 నుంచి 90 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ విద్య అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. ఓటంటే తెల్లకాగితం కాదని, అది సీఎం పదవి అన్నారు. రాష్ట్రంలో 40వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగించారని మండిపడ్డారు. ఒక్కరోజు కోసం ఓటు అమ్ముకుంటే ప్రజలు ఐదేళ్లు కష్టపడాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ సంఘాలు, దళిత సంఘాలన్నీ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ప్రజాఫ్రంట్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఎవరనీ కలవరు, ప్రజలనే కాదు.. ఆయన ఎమ్మెల్యేలను సైతం కలవరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని కృష్ణయ్య హావిూ ఇచ్చారు. నెల రోజుల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ క్రమబద్ధీకరిస్తామన్నారు. పాత పద్ధతిలోనే ఉద్యోగులకు పెన్షన్ అమలుచేస్తామని, కేసీఆర్ ఎవరినీ కలవడు..కలవనీయడని విమర్శించారు. ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇళ్లు, ఉద్యోగాలు, నీళ్లు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆర్.కృష్ణయ్య కోరారు.




