Monday, 2 November 2026

కెసిఆర్‌ జలవిధానాన్ని బహిష్కరించిన టిడిపి

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): జలవిధానంపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో గురువారం ఇచ్చిన  పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను టిడిపి బహిష్కరించింది. దీనిని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. పార్టీ ముఖ్యనేతలతో రేవంత్‌, రమణ టెలీకాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రదర్శించే జల విధానంపై ఎలా వ్యవహరించాలనే దానిపై నేతల నుంచి అభిప్రాయ సేకరించారు. అయితే అసెంబ్లీకి హాజరుకావద్దని మెజారిటీ నేతలు సూచించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలను భారీగా పెంచారు..అవినీతి ఆరోపణలు వస్తున్నాయని నేతలు చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని 83 వేల కోట్లకు పెంచారని వీటికి అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందాలని కేసీఆర్‌ చూస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ముఖ్య నేతలు టీటీడీపీ నేతలకు సూచించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌పై ప్రభుత్వ వైఖరి ఏకపక్షంగా ఉందని రేవంత్‌ మండిపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సభను వాడుకుంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చుతున్నారంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు. రూ.45 వేల కోట్ల పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి..తెలంగాణ నెత్తిన వేల కోట్ల అప్పులు పెడుతున్నారని రేవంత్‌, సండ్ర విూడియాకు వివరించారు. ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే దీనిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *