కేంద్రానివి దుర్మార్గపు చర్యలు
– తెలుగువారికి విశ్వనగరం ఉండాలన్న ఉద్దేశంతో అమరావతి నిర్మాణం
– గుజరాత్‌కు ఇష్టారీతిలో నిధులిస్తున్నారు
– మన రాజధానికి 1500 కోట్లే ఇచ్చారు
– తీరుమార్చుకోకపోతే తెలుగువారి ఆగ్రహానికి బలికాకతప్పదు
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– మూడోరోజు అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు
విజయవాడ, మే29(జనం సాక్షి) : విభజన హావిూలు నెరవేర్చాలని అడిగితే కేంద్రం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడు చివరిరోజు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘ప్రజా రాజధాని – మన అమరావతి – ఆనంద నగరం’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సహా కేంద్రానికి సమర్పించిన ఆధార సహిత యూసీలను చంద్రబాబు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు వారికి ఓ విశ్వనగరం ఉండాలన్న ఉద్దేశంతోనే అమరావతిని నిర్మిస్తున్నాం. మనం ఇచ్చిన పిలుపుతో రైతులు ఏకంగా 33వేల ఎకరాలు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తెదేపా ప్రభుత్వం విూద ప్రజలకున్న విశ్వసనీయతను ఇది తెలియజేస్తోంది. అమరావతిలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులతో ఆస్పత్రులు వస్తున్నాయి. అమరావతిలో అనుకున్న పనులన్నీ పూర్తి కావాలంటే మొదటి విడత రూ.45వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోంది. ఇచ్చిన యూసీలన్నీ తప్పని చెబుతోంది. గుజరాత్‌కు ఇష్టం వచ్చిన రీతిలో నిధులు కేటాయిస్తారు.. మనం రాజధాని కోసం అడిగితే మాత్రం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మన రాష్ట్రంలోని కొన్ని పార్టీలు పదవుల కోసం పాకులాడుతూ కేంద్రానికి వత్తాసు పలుతుకున్నాయి. రాష్ట్రం ప్రయోజనాలకు ఎవరు అడ్డుతగిలినా ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు.