Tuesday, 3 November 2026

కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేస్తాం

– గాలిని పంపినట్టే కేసీఆర్‌ని జైలుకు పంపుతా
– అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తాం
– అలా చేయకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
– మెగా సంస్థ కోసమే కాళేశ్వరం నిబంధనల మార్పు
– మేం అధికారంలోకి రాగానే కాళేశ్వరంకు అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్లగా మారుస్తాం
– మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను అర్హత లేని మెగా కంపెనీకి కట్టబెట్టారు
– ఫలితంగా 14 వేల కోట్ల అవినీతి పాల్పడ్డారు
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్‌, జులై2(జ‌నం సాక్షి ) : బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రంలో కేసీఆర్‌ కుటంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని, కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేసి.. గాలి జనార్దన్‌ రెడ్డిని జైలుకి పంపినట్టుగానే కేసీఆర్‌ను కూడా జైలుకు పంపుతానని కాంగ్రెస్‌ నేత  నాగం జనార్ధన్‌ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 1 నుంచి 28 చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అయితే… కాంగ్రెస్‌ చేసిన వాటిని కూడా తానే చేశానని చెప్పుకునే దౌర్భాగ్యంలో కేసీఆర్‌ ఉన్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, అవినీతికి సహకరించిన మంత్రులు, అధికారులు జైలుకు వెళ్లక తప్పదని నాగం జనార్ధన్‌ హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర మూడు లిప్టులు ఎందుకని ప్రశ్నించారు. మెగా కాంట్రాక్టు సంస్థకు పనులను కట్టబెట్టడానికే కాళేశ్వరం నిబంధనలు మార్చారంటూ మండిపడ్డారు. ముప్పై నెలల్లో పాలమూరు పూర్తి చేస్తామన్న కేసీఆర్‌ కనీసం పది శాతం పనులను పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పేరును అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెల్లగా మారుస్తామని నాగం పేర్కొన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను అర్హత లేని మెగా కంపెనీకి కట్టబెట్టారని, 14 వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని నాగం ఆరోపించారు. రివ్యూలు, రివిజన్‌ పేరు విూద కేసీఆర్‌ కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు నాగం విమర్శించారు. కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేస్తామని, ఈడీ, సీబీఐ దగ్గర కూర్చుంటామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్‌ నిర్మిస్తే.. ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం అవినీతిని సాక్ష్యాధారలతో నిరూపిస్తానని, అలా చేయకపోతే రాజకీయాల నుంచి నిష్కమ్రిస్తానని సవాల్‌ చేశారు. ఇక పాలమూరులో ఉన్న ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తయినవే… 10 శాతం పనులు కూడా నాలుగేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని నాగం ప్రశ్నించారు. రూ. 500 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని నాగం ఆరోపించారు. ఇక ప్రాజెక్టుల కింద పొరుగు జిల్లాల రైతులకు రూ. 12 లక్షలు పరిహారం ఇస్తున్నారు… నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రైతులకు మాత్రం రూ. 3 లక్షలే ఎందుకు ఇస్తున్నారని నాగం జనార్ధన్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో రూ. 5,780 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన… దీనిపై కోర్టులో కేసు వేస్తానన్నారు. ఇటీవల గద్వాల సభలో కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కోర్టుకెళ్తున్నారని మండిపడ్డారు.. దీనిపై స్పందించిన నాగం.. సీఎం విచ్చలవిడి అవినీతిని అడ్డుకోవడానికి మాత్రమే కోర్టుకు వెళ్లామన్నారు. రాష్ట్రం కోసమంటూ లక్షల కోట్లు అప్పు చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కుటుంబం మొత్తం బంగారు తెలంగాణను పది తరాలకు సరిపోయేలా దోచుకున్నరని విమర్శించారు.