– ప్రత్యేక రాష్ట్రం అంటే ప్రత్యేక రాజ్యాంగం కాదు
– కేసీఆర్ ప్రజల్ని నిండా ముంచారు
– స్వార్థ రాజకీయాల్లో ఆయనను మించినవారు లేరు
– ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయం
– డిసెంబర్ 4న పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తాం
– తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్27(జనంసాక్షి) : కేసీఆర్ నియంత పాలనను సాగించాడని, అన్ని వర్గాల ప్రజలను మాటలగారడితో మోసం చేశారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. మంగళవారం విూట్ ద ప్రెస్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ… కూటమి అధికారంలోకి వచ్చేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకుంటే వచ్చే నష్టమేవిూ లేదని వ్యాఖ్యానించారు. ఎటువంటి పట్టింపులు లేకుండా టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా కూటమిలో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులను ప్రజలు సన్నాసులుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాచ్‌డాగ్‌లా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు పిచ్చి కుక్కలా తయారయ్యాడని రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొంబాయి, బొగ్గు బావి, దుబాయ్ అని ప్రగల్బాలు పలికి ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు. రైతులను నిండా ముంచారన్నారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే తన మనవడిని కూడా రాజకీయాల్లోకి దింపుతాడని, స్వార్థ రాజకీయాల్లో ఆయనను మించిన వారు లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఒక్కసారి కూడా విమర్శించలేదని అన్నారు. తన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్‌ను విమర్శించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటారని రమణ అన్నారు. టీడీపీని హైదరాబాద్‌లోనే ప్రారంభించారని, ఇక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా స్పందించే గుణం తమ నాయకులకు ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కేసీఆర్ చేసిన కుట్రలన్నీ బెడిసి కొట్టాయని అన్నారు. లక్షల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి తీరతామని రమణ ధీమా వ్యక్తం చేశారు. కూకట్పల్లి విజయంతో కేసీఆర్ పతనానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. లక్షలమంది పోరాటంతో తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ మాత్రం తానొక్కడినే తెలంగాణ తెచ్చినట్టు మాట్లాడుతారని రమణ ఎద్దేవా చేశారు. అయినా ప్రత్యేక రాష్ట్రం అంటే ప్రత్యేక రాజ్యాంగం ఉండదని వ్యాఖ్యానించారు. కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలకు విలువ ఇస్తూనే ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నామని తెలిపారు. ఆచరణ సాధ్యమయ్యే హావిూలను మాత్రమే ఇచ్చామని, వచ్చే నెల 4న సాయంత్రం పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు.




