Thursday, 5 November 2026

కేసీఆర్‌ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి

– రైతు రాజు కావాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం
– హోం మంత్రి నాయిని
హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి): దేశంలో మార్పు కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో  హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ఏంతో అభివృద్ది దిశగా దూసుకెళ్తుందని అన్నారు. శరవేగంగా ముందుకు వెళ్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని నాయిని
అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నామని… రైతు, రాజు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా కేసీఆర్‌ పని చేస్తున్నారని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పాల్గొన్నారు.