హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కరి వల్లే రాలేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డి శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కాగానే అన్ని పార్టీలనూ కలుపుకొని వెళ్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం, చెస్ట్ ఆస్పత్రి తరలింపును నిరసిస్తే.. తమను అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
పొన్నాల సహా పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జానారెడ్డి మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని జానారెడ్డి, డీఎస్ చెప్పారు.




