Thursday, 5 November 2026

కొండెక్కిన చికెన్‌ ధరలు

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): కోడి మాంసం ధరలు కొండెక్కాయి. ఎండాకాలంతో పాటు  ఉత్పత్తి పడపోవడంతో అనూహ్యంగా ధరలు పెరిగాయి. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్‌ కూడా తోడయ్యింది. ప్రస్తుతమున్న కోడి మాంసం ధరలు.. చికెన్‌ ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాల్పులు, ఆకస్మికంగా కురుస్తున్న వర్షాల కారణంగా కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. గత పదిహేను రోజుల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో సుమారు 15 శాతం కోళ్లు పౌల్టీల్రలోనే మృతి చెందుతున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చికెన్‌కు డిమాండ్‌ వచ్చింది. ఓ వైపు కోళ్లు మృతి చెందడం.. మరోవైపు డిమాండ్‌ ఉండటంతో రిటైల్‌ మార్కెట్‌లో కోడి మాంసం ధరలు అమాంతం పెరిగాయి. పదిహేను రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ. 160లు ఉండగా.. ప్రస్తుతం రూ. 220ల పై ధర పలుకుతుంది. చికెన్‌ ధరలు పెరిగిపోవడంతో చికెన్‌ షాపులన్నీ వెలవెలబోతున్నాయి. ఇక ఈ నెల 17 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం కావడంతో కోడి మాంసానికి మరింత డిమాండ్‌ వచ్చే అవకాశం ఉంది.
—-