Wednesday, 4 November 2026

కొండ దిగిన బంగారం ధర

కొండెక్కి కూర్చున్న బంగారం ధర ఒకే రోజు పది గ్రాములకు వెయ్యి రూపాయలకుపైగా తగ్గిపోయింది.
కొండెక్కి కూర్చున్న బంగారం ఒక్కసారిగా తగ్గింది. ఒకే రోజు ఊహించనంత స్థాయిలో వెయ్యి రూపాయలకుపైగా తగ్గిపోయింది. 2011 తరువాత 10 గ్రాముల బంగారం ధర కనిష్ట స్థాయికి చేరింది. ఎంసిఎక్స్‌ (మల్టీ కామోడిటీ ఎక్చ్సేంజ్‌)లో 10 గ్రాముల ధర నిన్న ఒకే రోజు 1,004 రూపాయలు పడి 28,180 రూపాయలకు వచ్చింది. బంగారం ధర తగ్గుతుందని కొందరు విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. ఎన్నోరోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధర ఇంతగా తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగించింది. గడిచిన ఆరు నెలల్లో ధర 5 వేల రూపాయలకు పైగా తగ్గింది. ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం 27 వేల రూపాయల కంటే తక్కువకే లభిస్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర పెరుగుతుందా? తరుగుతుందా? అంటే మిశ్రమ స్పందన వస్తోంది. ప్రస్తుతం బంగారం ధర బేర్‌ మార్కెట్లో ఉన్నందున మరింతగా తగ్గే అవకాశం ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాలంలో బంగారం మాత్రమే భద్రత ఇస్తుందని, అందువల్ల మున్ముందు ధర పెరుగుతుందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యూఢిల్లీలో నిన్న 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 1250 రూపాయలు తగ్గి, 28 వేల 350 రూపాయలకు పడిపోయింది. ఒకే రోజు ఇంతగా ధర ఎప్పుడు తగ్గలేదు. గత ఏడాది 7 తరువాత బంగారం ధర ఇంత కనిష్టస్థాయికి పడిపోవడం ఇదే తొతిసారి. హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఈ రోజు 26 వేల 500 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం 28 వేల 500 రూపాయలుగా ఉంది. చెన్నైలో ఇంకా తక్కువగా ఉంది. ఇక్కడ 26,320 – 28,150 రూపాయలుగా ఉంది.
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఊహించని విధంగా వడిదుడుకులు వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థల పతనం తొలుత గ్రీన్‌లో మొదలై యూరోపియన్‌ దేశాలకు వ్యాపించింది. ఆ తరువాత 2008లో అమెరికాలో గృహరుణ సంక్షోభం – లేమాన్‌ బ్రదర్స్‌ బ్యాంక్‌ పతనం – బ్యాంకులు, ఆర్థిక సంస్థల దివాళా….. క్రమంగా ఈ విపత్తు ప్రపంచం అంతటా విస్తరించింది. ఉపాధి, వ్యాపారాలను, ప్రజల స్థితిగతులను అతలాకుతలం చేసింది. ఈ నేపధ్యంలో కొన్ని దేశాలు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను విక్రయించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దాంతో అధిక మొత్తంలో బంగారంను నిల్వచేసినవారిలో నష్టపోతామన్న భయాందోళన మొదలైంది. ధరలు ఇంకా తగ్గుతాయన్న భయంతో వారు తమ వద్ద నిల్వలను అమ్మడం మొదలుపెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.
2001లో బంగారం బుల్‌ రన్‌ మొదలైంది. అప్పటి నుంచి 2012 చివరి వరకు దీని ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. పెరగడమే కానీ తగ్గడం తెలియనట్లు బంగారం ధర రికార్డులను సృష్టించింది. గత ఏడాది నవంబరు.26న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 32,432 రూపాయల వరకు అమ్మకం జరిగింది. అదే ఈ రోజు చెన్నైలో 28,150 రూపాయలకు పడిపోయింది. ఫిబ్రవరి 24న మేం ఇచ్చిన వార్తాకథనంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 28 వేల 600 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని తెలియజేశాం. అంతే కాకుండా కొనుగోలుదారులు తొందరపడవద్దని కూడా సలహా ఇచ్చాం. మేం చెప్పిన విషయం నిజమైంది. ప్రస్తుత ధర కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *