Saturday, 7 November 2026

కొడంగల్‌లో టిఆర్‌ఎస్‌ భారీ రోడ్‌షో

గులాబీమయం అయిన పట్టణం

రేవంత్‌కు చెక్‌ పెట్టేలా కెటిఆర్‌ ప్లాన్‌

కొడంగల్‌ దత్తత తీసుకుంటానన్న కెటిఆర్‌

వికారాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి.. కొడంగల్‌ను నేను దత్తత తీసుకుంటా… సిరిసిల్ల తరహాలో కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా.. అని మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. జిల్లాలోని కొడంగల్‌ పట్టణంలో మంత్రి కేటీఆర్‌ భారీ రోడ్‌షో నిర్వహించారు. జనం భారగా హాజరైన ఈ కార్యక్రమం ద్వారా రేవంత్‌ రెడ్డికి చెక్‌ పెట్టాలన్న ధోరణిలో ముందుకు సాగారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. పరిపాలన అంటే ఏంటో ఈ నాలుగేళ్లలో చేసి చూపించాం. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నం. తెలంగాణ వస్తే చీకట్లు వస్తయని అపోహలు సృష్టించారు. ఇది వరకు 200 పెన్షన్‌ ఇచ్చేందుకు నానా గోస పెట్టారు. డిసెంబర్‌ 11 తర్వాత పెన్షన్లన్నీ రెట్టింపు అవుతాయి. పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి. పెన్షన్ల వయోపరిమితి 58 ఏళ్లకు తగ్గిస్తం. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నం. వందల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేసినం. రైతుల కోసం మరింత చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ తపన. ఢిల్లీ, అమరావతి బానిసలు మనకు అవసరమా? సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా.. సింహం లాంటి కేసీఆర్‌ కావాలా? కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్‌ వైపు ఉందామా? అడగకుండానే 24 గంటలు కరెంటు ఇచ్చిన టీఆర్‌ఎస్‌ వైపు ఉందామా? సంక్షోభం వైపు ఉందామా? సంక్షేమం వైపు ఉందామా? కొడంగల్‌కు నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? అని మత్రి కేటీఆర్‌ కొడంగల్‌ ప్రజలను ప్రశ్నించారు. ఇసుకేస్తే రాలనంత జనం.. కొడంగల్‌ సెంటర్‌లో కనుచూపుమేరలో జనప్రవాహం.. బిల్డింగులపైన, చెట్లపైనా ఎటుచూసినా జనమే. కేటీఆర్‌ రోడ్‌ షోకు యావత్‌ కోడంగల్‌ నియోజకవర్గం తరలి వచ్చింది. ఇప్పటివరకు కొడంగల్‌ను ఏలిన నేత, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఆ నియోజవర్గం పరువును మంటగల్పిన రేవంత్‌రెడ్డిపై కసితీర్చుకునేందుకు ఇవాళ టీఆర్‌ఎస్‌కు జనం జేజేలు పలికారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా కొడంగల్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న భావన కల్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌ పట్టణంలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. కొడంగల్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి తరపున కేటీఆర్‌ ప్రచారం నిర్వహించారు. కేటీఆర్‌ రోడ్‌ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనాలు ఇండ్లు, భవనాలపైకి ఎక్కి కేటీఆర్‌ రోడ్‌ షోను తిలకించారు. కేటీఆర్‌ రోడ్‌ షోతో కొడంగల్‌ పట్టణమంతా గులాబీమయమైంది. రోడ్‌షపోలో మంత్రి పట్నం మహేదంర్‌ రెడ్డి, ఎంపి జితేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.