హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా గురుకులాలు ప్రారంభం కానున్నాయి. గురుకులాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రానున్న నాలుగేళ్లలో 76వేల మందికి ప్రవేశాలు కల్పించాలనే ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకుసాగుతున్నారు. వాటిలో విద్యార్థుల సంఖ్యను పెంచేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు వసతి, భోజనం, తరగతులు, తాగునీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలపై మంత్రి కడియం ఆరా తీశారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కొత్త గురుకులాలు నాలుగేళ్లలో ఇంటర్ స్థాయికి అప్గ్రేడ్ కానున్నాయి. దీంతో గురుకులాలను నాణ్యమైన పాఠశాల విద్యతో పాటు, ఇంటర్ విద్యనూ అందించేలా అత్యున్నతస్థాయికి తీసుకెళ్లాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గురుకులాలన్నీ కూడా అద్దె భవనాల్లో కొనసాగనున్నాయి. వచ్చే ఏడాదిలోగా పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో స్థలాన్ని సేకరించే పనిలోపడ్డారు. ఒక్కో గురుకులాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.




