కొన్ని నవ్వులు.. మరికొన్ని మిఠాయిలు..
ఆకట్టుకుంటున్న సచిన్ దీపావళి ట్వీట్
ముంబయి: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటున్న సంగతి తెలిసిందే. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో చోటుచేసుకున్న విశేషాల గురించి చర్చిస్తూ.. కొత్తగా ఏ ఆటగాడైనా నూతన రికార్డులు సృష్టిస్తే వారిని అభినందిస్తూ.. ఇలా నిత్యం ఏదో ఒక విధంగా సోషల్ విూడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. సచిన్ ట్విటర్ వేదికగా బ్రెట్‌లీ(ఆసీస్ మాజీ క్రికెటర్), జాంటీ రోడ్స్(దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్)తో కూడిన ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు. స్వీట్ షాట్స్ అనే పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సచిన్, బ్రెట్‌లీ, జాంటీ రోడ్స్ ముగ్గురు కళ్లు మూసుకొని తాము ఏ స్వీటు తిన్నారో దాని పేరును గుర్తించారు. ఎన్నో నవ్వులు పూయించిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
‘దీపావళి అంటేనే భిన్న రకాల మిఠాయిలతో సంతోషంగా చేసుకునే పండుగ. ఈ దీపావళికి నేను, బ్రెట్‌లీ, జాంటీ రోడ్స్ కొన్ని నవ్వులు, మరికొన్ని మిఠాయిలతో ఆనందంగా పండుగ జరుపుకొన్నాం. ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. సచిన్ ఇటీవల ముంబయిలో తెందూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడవిూ పేరుతో ఓ క్రికెట్ అకాడవిూని ప్రారంభించిన సంగతి తెలిసిందే.



