
మోగిన పంచాయతీ నగార
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
13న నామినేషన్ల స్వీకరణ
14న పరిశీలన, 15న తిరస్కరణ
17న ఉపసంహరణ
21,491 పంచాయతీలకు ఎన్నికలు
23, 27, 31 తేదీల్లో పోలింగ్
కట్టుదిట్టమైన ఏర్పాట్లు : రమాకాంతరెడ్డి
హైదరాబాద్, జూలై 3 (జనంసాక్షి) :
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కోసింది. పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో 21,491 గ్రామ పంచాయతీలకు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,19,253 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు 2 గంటలన ఉంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఈ నెల 9న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంతరెడ్డి తెలిపారు. రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఈనెల 9న నుంచి 13 వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చు. 14న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల తిరస్కరణ, 17 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. మొత్తం 21,543 గ్రామపంచాయతీలు ఉండగా.. ఎన్నికల నుంచి 52 పంచాయతీలకు మినహాయింపునిచ్చామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమయ్యే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు.
మూడు దశల్లో ఎన్నికలు..
మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారీగా నిర్వహించే ఎన్నికల తేదీలను రమాకాంత్‌రెడ్డి విడుదల చేశారు. 21,491 గ్రామ పంచాయతీలకు, 2,17,558 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండగా… ఈ నెల 23న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 27న రెండో దశ, 31న మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు 9న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నామినేషన్ల స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 13 తుది గడువు. 14న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు 2,19,253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులు ఎత్తడం ద్వారా ఉప సర్పించ్ ఎన్నిక జరుగుతుంది. ఫలితాలు విడుదలయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుంది.
బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్
పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించనున్నట్లు రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతి ఉంటుందన్నారు. 1,19,333 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని, మిగతావి కర్ణాటక నుంచి తెప్పిస్తామన్నారు. పాదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రలా జిల్లాకు ముగ్గురు పరిశీలకులు నియమించనున్నట్లు చెప్పారు. అలాగే, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, వివాదాస్పద పంచాయతీలను గుర్తించి, అందుకు తగినట్లుగా భద్రతా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు వివాదాస్పద ప్రాంతాలను గుర్తిస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతల అంశంపై పోలీసులు దృష్టి సారించారని, భద్రతా ఏర్పాట్లు ప్రారంభించారన్నారు. పెయిడ్ న్యూస్ నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
కోడ్ అమల్లోకి..
ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని రమాకాంతరెడ్డి తెలిపారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రభుత్వం ఎలాంటి నూతన పథకాలకు ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు. అలాగే, నూతన పథకాల ప్రకటన, ఓటర్లను ప్రభావితం చేసే విధానపర నిర్ణయాలకు బ్రేక్ పడింది. చివరికి ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ అంశంపైనా కోడ్ ప్రభావం చూపనుంది. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించకుంటే, శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతామని కార్మికులు ప్రకటించడం, వారితో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం కోడ్‌కు విరుద్ధం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తీసుకొనే నిర్ణయాన్ని పరిశీలిస్తామని ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభత్వం తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధం కాదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన సూటిగా స్పందించలేదు. ఊహజనిత ప్రశ్నలకు సమాధానం ఉండదన్నారు. నిర్ణయం తీసుకుంటే, అప్పటి పరిస్థితులను బట్టి తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
జూలై 9 : జిల్లాల వారీగా నోటిఫికేషన్ల విడుదల, అదే రోజున ఓటర్ల జాబితా పరిశీలన
జూలై 13 : నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
జూలై 14 : నామినేషన్ల పరిశీలన
జూలై 15 : నామినేషన్ల తిరస్కరణ
జూలై 17 : ఉపసంహరణకు గడువు
జూలై 23 : 6,863 పంచాయతీలకు తొలి దశ ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్
జూలై 27 : 7738 పంచాయతీలకు ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు
జూలై 31: మూడో దశలో 6,890 పంచాయతీలకు ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు
జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ఇలా..
జిల్లా మొదటి దశ రెండో దశ మూడో దశ
ఆదిలాబాద్ ఆసిఫాబాద్, ఉట్నూరు ఆదిలాబాద్, మంచిర్యాల నిర్మల్
అనంతపురం పెనుకొండ ధర్మవరం అనంతపురం
చిత్తూరు తిరుపతి చిత్తూరు మదనపల్లి
తూర్పుగోదావరి రంపచోడవరం, రాజమండ్రి కాకినాడ, పెద్దాపురం అమలాపురం
గుంటూరు తెనాలి గుంటూరు నర్సారావుపేట
కరీంనగర్ పెద్దపల్లి, మంథని జగిత్యాల, సిరిసిల్ల కరీంనగర్
ఖమ్మం భద్రాచలం ఖమ్మం కొత్తగూడెం, పాల్వంచ
కృష్ణా నూజివీడు విజయవాడ మచిలీపట్నం, గుడివాడ
కర్నూలు కర్నూలు నంద్యాల ఆదోని
మహబూబ్‌నగర నాగర్‌కర్నూలు, వనపర్తి మహబూబ్‌నగర్ గద్వాల్, నారాయణపేట
మెదక్ సిద్దిపేట మెదక్ సంగారెడ్డి
నల్లగొండ భువనగిరి నల్లగొండ, సూర్యాపేట మిర్యాలగూడ
నిజామాబాద్ నిజామాబాద్ బోధన్ కామారెడ్డి
ప్రకాశం ఒంగోలు కందుకూరు మార్కాపురం
రంగారెడ్డి రంగారెడ్డి (ఈస్ట్) చేవెళ్ల వికారాబాద్
నెల్లూరు నెల్లూరు కావలి గూడూరు
శ్రీకాకుళం శ్రీకాకుళం పాలకొండ టెక్కలి
విశాఖపట్నం పాడేరు నర్సీపట్నం విశాఖ
విజయనగరం పార్వతీపురం విజయనగరం –
వరంగల్ ములుగు మహబూబాబాద్, నర్సంపేట వరంగల్, జనగాం
పశ్చిమగోదావరి ఏలూరు కొవ్వూరు, జంగారెడ్డిగూడెం నర్సాపురం
వైఎస్సార్ కడప కడప రాజంపేట జమ్మలమడుగు




