Monday, 2 November 2026

కోడ్‌ కొరడాతో సాగని పనులు

ఇసి తీరుపై మండిపడుతున్న సామాన్యులు
హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): గత ఆరు నెలలుగా వరుసగా జరుగుతున్న ఎన్నికల కారణంగా సాధారణ
పరిపాలన దాదాపుగా స్తంభించిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు ఏ పని చేపట్టాలన్నా ఎన్నికల కోడ్‌ అంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నా ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఇసి కోడ్కొరడా చూపిస్తూ అడుగు ముందుకు వేయనీయడం లేదు. ఎపిలో అయితే ఎన్నికైన ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. గత ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ప్రతిష్టంభన మరో నెల రోజుల పాటు కొనసాగనుండగా, మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభమైతే మరో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి ముగిసిన 20 రోజుల తరువాత పంచాయతీ ఎన్నికల కారణంగా మరోసారి కోడ్‌ తెరపైకి వచ్చింది. ఓవైపు ఎన్నికలు, మరో వైపు ఎన్నికల విధుల కారణంగా అధికార యంత్రాంగం అంతా అదే పనుల్లో నిమగ్నమైంది. ఆ తరువాత కొన్ని నెలలు మాత్రమే గడువు ఉండగా, బ్జడెట్‌ సమావేశాలు పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ తరుణం లోనే పార్లమెంట్‌ ఎన్నికల నియమావళి రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీంతో ప్రజలు మామూలు పనుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రెవెన్యూ పరిపాలనతో పాటు వ్యవసాయ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల శాఖలే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలన్ని దాదాపుగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖల ద్వారా భూములకు సంబంధించిన వ్యవహరాలే కాకుండా అనేక కార్యకలా పాలకు ఎన్నికల కోడ్‌ ఆటంకంగా మారుతోంది. గత ఆరె నెలల నుంచి సాధారణ ప్రజానీకం తమ పనుల కోసం కార్యాలయాల చూట్టు తిరుగుతూ అలసిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పాటు వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలకు సైతం ఎన్నికల కారణంగా గ్రహణం పట్టింది. వివిధ శాఖల్లో సబ్సిడీ పథకాల కోసం లబ్దిదారుల ఎంపిక పక్రియ పూర్‌ఖ్తెనప్పటికీ, ఆ పథకాల అమలుకు ఎన్నికలు బ్రేక్‌ వేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగియగానే లోక్‌సభ ఎన్నికలు రావడం జరిగింది. అయితే కోడ్‌ అమలులో ఉండగానే ఎన్నికల కమిషన్‌ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ వైపు ఎన్నికల కోడ్‌ కారణంగా, మరోవైపు అధికార యంత్రాంగం అంతా ఎన్నికల బిజీ కారణంగా సాధారణ పరిపాలన పూర్తిగా స్తంభించిందని అంటున్నారు. దీంతో పాటు వివిధ రకాల సంక్షేమ, అభివృద్ది పథకాలు సైతం అర్దాంతరంగా నిలిచిపోనున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే అనేక రకాల సబ్సిడీ పథకాల కోసం ఎంపికైన లబ్దిదారులంతా ఈ పథకాలు తమకు ఎప్పుడు వర్తిస్తాయోనన్న ఆందోళనలో ఉన్నారు. వరుస ఎన్నికల పుణ్యమా అని ఈ లబ్దిదారులంతా తీవ్ర మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైనందున ఆ పక్రియను కొనసాగిం చే బాధ్యత అన్ని శాఖలపై ఉన్న సామాన్యలు జీవితాలపై ప్రభావం చూపేలా ఉండకూడదు.  ప్రజాస్వామ్య మనుగడకు కీలకంగా నిలుస్తున్న ఎన్నికల వ్యవహారం అడ్డంకులకు కారణం కారాదు. ఓ వైపు పాలన, మరో వైపు సంక్షేమం, అభివృద్ది అవసరమే కనుక ఎన్నికల తంతు ముగిసినందున కనీస కార్యక్రమాలకు కోడ్‌ తొలగించాలి. ఇప్పుడు కొత్తగా కేవలం ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది.