సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ,డిసెంబర్16(జనంసాక్షి): యుపిఎ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన కోల్‌స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను విచారించడానికి సీబీఐ సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన ఆనాటి ప్రధాని మన్మోహన్ కూడా విచారించాలని సీబీఐ యోచిస్తోంది. హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై సీబీఐ సమర్పించిన తుది నివేదికను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్ వాంగ్మూలం నమోదు చేయాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిల్లాతోపాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ పాత్రపై దర్యాప్తు కొనసాగించాలని సూచించింది. జనవరి 27 నాటికి దర్యాప్తు పురోగతిపై నివేదిక అందజేయాలని ప్రత్యేక కోర్టు సీబీఐను ఆదేశించింది.ఈ నేపథ్యంలో మన్మోహన్ ను సీబీఐ విచారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే మన్మోహన్ ను విచారించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయనకు పలువురు కాంగ్రెస్ సీనియర్లు బాసటగా నిలిచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమాయకుడని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో రేణుకాచౌదరి మాట్లాడుతూ… బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో కేటాయింపుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాగ్మూలం నమోదు చేయాలని ప్రత్యేక న్యాయస్థానం సీబీఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేణుకాచౌదరిపై విధంగా స్పందించారు.





