Monday, 2 November 2026

ఖాతాదారులకు మళ్లీ షాక్ ఇచ్చిన ఎస్బీఐ

న్యూఢిల్లీ: భారత అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ మరోసారి సమాన్యుడికి నిరాశ కలిగించేలా నిర్ణయం తీసుకుంది. సేవింగ్ ఖాతాల డిపాజిట్లపై వడ్డీరేటును 0.5 శాతం కోతవిధించి ఖాతాదారులకు షాకిచ్చింది. నూతన వడ్డీరేట్ల ప్రకారం… సేవింగ్ ఖాతాల్లో రూ.1 కోటి కంటే తక్కువ నిల్వలున్న వినియోగదారులకు ఇకపై3.5 శాతం మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. ఇంతకు ముందు ఇది 4 శాతంగా ఉండేది. సేవింగ్ ఖాతాల్లో రూ.1కోటికి పైగా ఉన్న డిపాజిట్లపై యధావిధిగా 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. కొత్త వడ్డీరేట్లు సోమవారం నుంచే అమలవుతాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఓ వైపు ప్రయివేటు రంగ బ్యాంకులు 6 శాతం మేర వడ్డీలతో వినియోగదారులను ఆకర్షిస్తుంటే.. ఎస్బీఐ మాత్రం వడ్డీరేట్లలో కోత పెడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎస్బీఐ ఇంతకు ముందు వివిధ టెర్మ్ డిపాజిట్ల వడ్డీరేటును కూడా 50 బేసిస్ పాయింట్ల మేర భారీగా కోత విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజా నిర్ణయంతో ఎస్బీఐ షేర్లు మాత్రం లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకు షేరు 3.71 మేర లాభపడి రూ.310 పైనే ట్రేడవుతోంది.