
విప్లపవీరుడికి ఘన నివాళి
ప్రసాదంది ప్రభుత్వ హత్యే
ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టండి
మావోయిస్టు నేత గుడ్సా ఉసెండీ పిలుపు
హైదరాబాద్/నెల్లూరు, జూలై 5 (జనంసాక్షి) :
అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకుడు, మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు గంటి ప్రసాదం అంత్యక్రియలు శుక్రవారం నెల్లూరు ముగిశాయి. పౌర హక్కుల నేతల కళ్యాణ్‌రావు తదితరులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని ఘన నివాళులర్పించారు. గురువారం గుర్తు తెలియని వ్యక్తులు ప్రసాదంపై వేటకత్తితో దాడిచేసి, తుపాకీతో కాల్పులు జరిపారు. ఈఘటనలో తీవ్రంగా గాయాలపాలైన ఆయనను కాపాడేందుకు నారాయణ ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈవార్త రాష్ట్రవ్యాప్తంగా దావానంలా పాకింది. దీంతో యావత్ రాష్ట్రం నివ్వెరపోయింది. విప్లవకారుల సానుబూతి పరులు, మాజీనక్సల్స్ కుటుంబాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన మాజీ నక్సల్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలపై వీరోచితంగా పోరాటాలు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకుని ఆదిలాబాద్ వరకు, తిరుపతి నుంచి మొదలుకుని కరీంనగర్ వరకు ప్రతి జిల్లాలో సైతం ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. చాలా మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో సైతం ప్రసాదం సందర్శించి పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలతో నేరుగా సంబందాలు పెంచుకున్నాడు. గంటి ప్రసాదంది విజయనగరం జిల్లా అయినా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం కోమర్తికూడల లో నివసిస్తున్నారు. 1980 నుంచి నక్సలైట్ల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చాడు. ప్రసాదం సోదరుడైన సుబ్రహ్మణ్యం అలియాస్ రాజన్న అజ్ఞాతంలోనే కొనసాగారు. చురుకైన పాత్ర పోషించిన ప్రసాదం సోదరుడిని 1998లో కొప్పడంగి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు హత్య చేశారు. ఆతర్వాత విప్లవకారుల సూచనల మేరకు ప్రసాదం అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎస్పీ లడ్డాపై హత్యాయత్నం కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆతర్వాత చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించారు. మూడేల్ల తర్వాత షరతులతో కూడి న బెయిల్‌పై బయటకు వచ్చారు ప్రసాదం. ఒడిస్సా ప్రభుత్వంతో మావోయిస్టులకు మద్య చర్చలు జరిపిన సమయంలో మద్యవర్తిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అమరవీరుల బంధుమిత్రుల కమిటీని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈయనకు శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామానికి చెందిన కామేశ్వరమ్మతో 1984లో వివాహం అయింది. వీరికి ఓ కుమారుడున్నాడు. ఆయన చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు. కామేశ్వరమ్మ మాత్రం గ్రామంలోనే అంగన్వాడీ కార్యకర్తగా ఉద్యోగం చేస్తోంది. ప్రసాదంది ప్రభుత్వ హత్యేనని మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సా ఉసెండీ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
గంటి ప్రసాదానికి అంతిమ వీడ్కోలు




