Tuesday, 3 November 2026

ఉచిత హామీలు అవినీతి కాదు


తాయిళాలపై మార్గదర్శకాలు రూపొందించండి
ఈసీకి సుప్రీం హుకుం
న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) :
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓటర్లపై కురిపించే ఉచిత హామీలు అవినీతి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పార్టీల తాయిళాల ప్రక్రియపై మార్గదర్శకాలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘానికి సూచించింది. పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి ఉచిత హామీలపై మార్గనిర్దేశకాలు తయారు చేయాలని ఆదేశించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం రాజకీయ పార్టీల ఉచిత హామీలను అవినీతిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే న్యాయవాది దాఖలు చేశారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే తాయిలాలు అవినీతి కిందకు వస్తాయని, వాటిని నియంత్రించాలని ఆదేశాలు జారీ చేయాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఎన్నికల సందర్భంగా ఓ రాజకీయ పార్టీ ఉచితంగా కలర్‌ టీవీలు అందజేస్తామని ఇచ్చిన హామీపై ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, పిటిషనర్‌ విజ్ఞప్తిని న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివం తోసిపుచ్చారు. ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు, తాయిలాలు అవినీతి కిందకు రావని స్పష్టం చేశారు. ప్రస్తుత చట్టాల మేరకు ఆయా హామీలను అవినీతిగా పరిగణించలేమన్నారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని 123 నిబంధన ప్రకారం ఉచితంగా టీవీలు, ల్యాప్‌టాప్‌లు అందజేయడం అవినీతి కిందకు రాదన్నారు.అయితే, పార్టీల ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో ఇచ్చే హామీల అమలుపై మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఉచిత హామీలు, తాయిలాలు ఓటర్లపై ప్రభావితం చూపుతాయని, ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కల్పిస్తాయని.. అందుకే ఉచిత హామీలపై మార్గదర్శకాల రూపకల్పన తప్పనిసరి అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఖాళీ చేయాల్సిందే..
పదవీ విరమణ చేసిన వారు ప్రభుత్వ క్వార్టర్స్‌ను వీడివెళ్లేందుకు గాను సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రూపొందించింది. ప్రభుత్వ వసతి సముదాయాల్లో ఎంపీలు, మంత్రులు తిష్టవేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వార్టర్స్‌ ఖాళీ చేయని వారిపై సంబంధిత సిబ్బంది సభాపతులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. హౌస్‌ కమిటీ సిఫారసుల మేరకు ఆయా ఎంపీలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని సభాపతులకు సూచించింది. న్యాయమూర్తులు, ఉద్యోగులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. పదవీ విరమణ చేసిన నెల రోజుల్లోపు న్యాయమూర్తులు, 15 రోజుల్లోపు ఉద్యోగులు ప్రభుత్వ క్వార్టర్స్‌ను వీడివెళ్లాల్సిందేనని జస్టిస్‌ సదాశివం తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *