Wednesday, 4 November 2026

గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

pjv8hc0n

హైదరాబాద్ : వినాయక నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. గణేష్‌ శోభాయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్ర్తతలు తీసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోడ్లు, వీధి లైట్ల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. వినాయక చవితి.. ఆ సందడే వేరు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ హుషారుగా చవితి సంబరాల్లో పాల్గొంటారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లే కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. గ్రేట‌ర్ ప‌రిధిలో 23 నిమ‌జ్జన కేంద్రాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో వ‌చ్చే వ్యర్థ ప‌దార్థాల‌ను తొల‌గించ‌డానికి 41 ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల 25 వాహ‌నాలు, 25 ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల 114 వాహ‌నాలు, 14 జేసీబీలను ఏర్పాటు చేయనున్నారు. గణేష్‌ నిమజ్జన స‌మ‌యంలో వ‌చ్చే చెత్తను ఎప్పటిక‌ప్పుడు తొల‌గించేందుకు ప్రత్యేకంగా 162 టీమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో 2063 మంది పారిశుద్ధ్య కార్మికులు, 364 ఫిల్డ్ అసిస్టెంట్లు, 70 మంది సూప‌ర్ వైజ‌ర్లు ఉంటారు. వీరంతా భక్తులకు 24 గంట‌ల‌పాటు అందుబాటులో ఉంటారు. ఈ నెల 24న జ‌రిగే బ‌క్రీద్‌ సంద‌ర్భంగా వ‌చ్చే జంతు సంబంధిత వ్యర్థాల‌ను వెంట‌ వెంటనే తొల‌గించ‌డానికి ప్రత్యేక చ‌ర్యలు చేపట్టారు. ఇటీవ‌ల హైదరాబాద్‌లో కురిసి భారీ వర్షాల కార‌ణంగా రోడ్లు బాగా దెబ్బతిన్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అందుకే గణేష్‌ శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. గ్రేటర్‌లో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలని అధికారులు ప్లాన్‌ చేశారు. ఇందుకోసం 10 కోట్లు మంజూరు చేశారు. ఇక ఇప్పటికే ఉన్న వీధి దీపాలను సరిచేయడంతో పాటు అదనంగా మరిన్ని వీధి లైట్లను ఏర్పాటు చేయనున్నారు. గణేష్‌ నిమజ్జన సమ‌యంలో విద్యుత్‌కు అంత‌రాయం క‌లగ‌కుండా ప్రత్యేక చ‌ర్యలు చేప‌ట్టారు. మొత్తంగా గణేష్‌ శోభాయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ప్రభుత్వం, అటు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *