Tuesday, 3 November 2026

గల్ఫ్‌ బాధితులకు కాంగ్రెస్‌ అండ

అధికారంలోకి రాగానే అమలు చేస్తాం: కోమటిరెడ్డి

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే గల్ప్‌ కార్మికుల సంక్షేమం కోసం రూ.500కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తున్నట్లు చెప్పారు. గల్ఫ్‌లో ఎవరైనా మృతి చెందితే రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. గల్ఫ్‌ కార్మికుల కోసం రూ.1000కోట్లతో ఫండ్‌ పెట్టామని చెబుతున్న కేసీఆర్‌.. గల్ఫ్‌ బాధితులను తగిన న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. బాధితులను ఆదుకోవడంతో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 10లక్షల మంది ఉపాధి కోసం గల్ప్‌ దేశాలకు వెళ్లారని .. వారికి కాంగ్రెస్‌ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి తక్షణ సాయం చేస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే వివరాలు సేకరించి సహాయక చర్యలు చేపడతామని అన్నారు.