Thursday, 5 November 2026

గవర్నర్‌ గుడికి పోయినా రాద్ధాతమా?

విపక్షాల తీరుపై నరసింహన్‌ అసమనం

తెలంగాణలో వైద్యరంగం పురోగిస్తోందని కితాబు

తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సందర్శన

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తాను పూజకు వెళ్లిన ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్‌గా తన బాధ్యతలను తాను అంకితభావంతో నిర్వర్తిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖలపై దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులను వ్యక్తిగతంగా పరిశీలించినట్టు ఆయన వెల్లడించారు. ఎవరో చెబితే తాను నమ్మనని, అన్ని విషయాలు తనకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం కృషి జరుగుతుందని నరసింహన్‌ అన్నారు. తెలంగాణ మోడల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌గా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. నారాయణగూడలోని డయగ్నోసిస్‌ సెంటర్‌ను గురువారం నరసింహన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే చోట అన్ని పరీక్షలు నిర్వహించి 24గంటల్లో ఫలితాలు ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. నారాయణగూడ ఐపీఎం(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌)లో తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంట్రల్‌ ల్యాబ్‌ను గవర్నర్‌ నరసింహన్‌, వైద్యారోగ్య శాఖ మంత్రిలక్ష్మారెడ్డి తో కలసి ఉదయం పరిశీలించారు. ల్యాబ్‌ను పరిశీలించిన అనంతరం డయాగ్నొస్టిక్‌ సెంట్రల్‌ ల్యాబ్‌పై గవర్నర్‌ ప్రశంసలు కురిపించారు. ప్రతీ ఒక్కరికీ ల్యాబ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్‌ తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన గవర్నర్‌.. త్వరలోనే బస్తీ దవాఖానాలను కూడా పరిశీలిస్తానని చెప్పారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ దేశంలోనే ఉత్తమమైందని కితాబిచ్చారు. సర్కార్‌ వైద్యాన్ని గుడ్డిగా విమర్శించడం సరికాదన్నారు గవర్నర్‌. ఆస్పత్రుల్లో సదుపాయాలు పరిశీలించిన తర్వాతనే విమర్శించాలని గవర్నర్‌ సూచించారు. మార్చురీల విషయంలో కూడా కొన్ని మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇకపై సర్కార్‌ దవాఖానాలపై బ్రేకింగ్‌ న్యూస్‌ ఏవీ ఉండవని భావిస్తున్నానని గవర్నర్‌ పేర్కొన్నారు. నిజంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వ పనితీరును స్వయంగా పరిశీలించే అభినందిస్తున్నాని గవర్నర్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ ఏం చేసినా తప్పు అన్నట్టు ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్‌ గుడికి పోయినా రాద్దాంతం చేస్తున్నారని నరసింహన్‌ ఆగ్రహం వెలిబుచ్చారు.